Wardha Barrage | కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ సర్కారు వార్ధా నదిపై బరాజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టగా, ఇక దానికి బ్రేక్ పడ్డట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ఈ పథకానికి శంకుస్థాపన చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ప్రాజెక్టు ఊసెత్తకపోగా, అసలు నిర్మాణం చేపడుతుందా.. లేక వదిలేస్తుందా అన్న ప్రశ్నలు రైతన్నలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
‘వార్ధా’పై ఊసెత్తని కాంగ్రెస్ సర్కారు
2008లో ప్రాణహిత నదిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించారు. సుమారు రూ. 35 వేల కోట్ల అంచనాతో నిర్మించి, కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కాలువల నిర్మాణం కోసం 7889 ఎకరాలను సేకరించారు. ప్రధాన ప్రాజెక్టు పనులు ప్రారంభంకాకముందే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కాలువల పనులు చేపట్టారు. వీటి నిర్మాణం, తదితరాల కోసం రూ. 762 కోట్లు ఖర్చుచేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణాన్ని రీడిజైన్ చేసి పర్యావణానికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, ఎలాంటి అవాంతరాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును నిర్మించారు. అలాగే వార్ధా నదిపై బరాజ్ నిర్మించాలని కేసీఆర్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు రూ. 75 కోట్లు మంజూరు చేసి, ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది. కాగా, తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరం తరలించారని నాటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా బరాజ్ నిర్మాణంపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అసలు వార్ధా బరాజ్ నిర్మాణం చేపడుతుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
రెండు జిల్లాలు.. రెండు లక్షల ఎకరాలు..
వార్ధాపై బరాజ్ ద్వారా కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రాజెక్టు ముఖ్యఉద్ధేశం. గుండాయిపేట్ వద్ద నిర్మించే ఆనకట్ట నుంచి ప్రాణహిత కాలువకు అనుసంధానం చేసి నీటిని మళ్లించి, మార్గమధ్యంలో 9 పంపుహౌస్‌లను ఏర్పాటు చేసి.. సమీపంలోని చెరువులకు సైతం నీటిని మళ్లించేలా బరాజ్ డిజైన్ చేశారు. ఈ రెండు జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో ఉన్న 127 గ్రామాల రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును రూపొందించారు. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వార్ధా బరాజ్‌ను నిర్మిస్తుందా.. లేదా అనేది సందేహంగా మరింది. 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.