శ్రీరాంపూర్, ఫిబ్రవరి 3 : సింగరేణిలో 20 వేల మంది యువకులకు కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన కారుణ్య ఉద్యోగాలతో నేడు సింగరేణి యువ రక్తంతో నిండి ఉందన్నారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిని వారసత్వ ఉద్యోగాలను కారుణ్య ఉద్యోగాలతో భర్తీ చేశారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎవరూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.500 కోట్ల సింగరేణి నిధులతో మెడికల్ కళాశాలను నిర్మించి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థ నిధులను ఇతర జిల్లాలకు తరలిస్తున్నదనిఆరోపించారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను కోలిండియాతో సంబంధం లేకుండా సింగరేణి కార్మికులకు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 12 శాతం ఉన్న బోనస్‌ను 32 శాతానికి తీసుకువచ్చారని కొనియాడారు. కానీ కాంగ్రెస్ 33 శాతం ఇస్తామని 16 శాతమే లాభాల వాటా ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలిచ్చారని, గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అబద్ధాల రేవంత్‌కు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన నూతన జిల్లాలతో ప్రజలకు ప్రభుత్వ పాలన చెరువైందన్నారు. సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కాపు శ్రీనివాస్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్, కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, సహాయ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, వెంకట్మ్రణారెడ్డి, మహిపాల్‌రెడ్డి, తొంగల రమేశ్, రఫీఖ్ఖాన్, రాజునాయక్ పాల్గొన్నారు.