మంచిర్యాల, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కేసీఆర్ సచ్చు డో.. తెలంగాణ తెచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా, నేటికి పదహారేండ్లు అవుతున్నది. కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలానికి బయలుదేరిన కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అరెస్టు చేసినా జైలులోనే దీక్ష కొనసాగించారు. కేసీఆర్ దీక్షకు మద్దతుగా యావత్ తెలంగాణ ప్రాంతం అట్టుడికింది.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు రేకెత్తాయి. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొ దలు పెడతామంటూ ప్రకటించారు. అక్కడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2012 నుంచి యేటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేడు శనివారం దీక్షా దివ స్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాల్లో సన్నాహక సమావేశాలు సైతం నిర్వహించాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహణకు ఏర్పా ట్లు పూర్తి చేశారు. మంచిర్యాల జిల్లాలో 3000 మందితో, ఆసిఫాబాద్ జిల్లాలో 1000 మందితో, నిర్మల్ 2000, ఆదిలాబాద్ జిల్లాలో 2000 మందితో పెద్ద ఎ త్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మంచిర్యాలలో బాల్కసుమన్, దివాకర్‌రావు, చిన్నయ్య, ఆసిఫాబాద్‌లో ప్రవీణ్‌కుమార్, కోవ లక్ష్మి, కోనేరుకోనప్ప, నిర్మల్ జిల్లాలో జాన్సన్ నాయక్, రాంకిషన్‌రెడ్డి, రమాదేవి, ఆదిలాబాద్‌లో జోగురామన్న, అనిల్‌జాదవ్ పాల్గొననున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 28, (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో శనివారం నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గం నుంచి సుమారు 1000 మంది పాల్గొననున్నారని, అందుకు సరిపడా ఏర్పాట్లు చేయాలని సూచించారు.