మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు శుక్రవారం కనుల పండువగా సాగాయి. భక్తులు వేలాదిగా తరలిరాగా, ఆలయాలన్నీ కిటకిటలాడాయి. మహిళలు వేకువ జామునే తల స్నానాలు చేసి.. ఉసిరి కొమ్మల ను తులసీ కోటలో ప్రతిష్ఠించి దీపాలు వెలిగించారు. ఆయాచోట్ల గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులతో పాటు వాగుల్లో పుణ్యస్నానాలు ఆచరించి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. దండేపల్లి మండలంలోని గూడెం గుట్టకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. సుమారు లక్షకుపైగా తరలివచ్చారు. సత్యనారాయణస్వామి ఆలయంలో సుమారు 1500కు జంటలు సామూహిక వ్రతాలు ఆచరించాయి. మహిళలు స్థానిక గోదావరిలో ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు.
సత్యదేవుడిని కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, ఆయన సతీమణి సురేఖ, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ దర్శించు కున్నారు. సుమారు 200 మందికి పైగా భక్తులు, ఆలయ వ్యవస్థాపకుడు గురుస్వామి, చక్రవర్తుల పురుషోత్తమాచార్యులతో మాలాధారణ స్వీకరించారు. దేవాదాయదాఖ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గూడెం గోదావరి వద్ద ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు ఆయా మండలాల్లోని ప్రముఖ ఆలయాల్లో కార్తీక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
– నమస్తే బృందం