దండేపల్లి, నవంబర్14 : నేడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గూడెంలోని ఆలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. సత్యనారాయణస్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతర సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లడ్డూలు, పులిహోరా ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. భక్తులు సేదదీరేందుకు షామియానాలు ఏర్పాటు చేశారు. గురువారం జాతర ఏర్పాట్ల గురించి లక్షెట్టిపేట సీఐ నరేందర్, ఎస్ఐ ఉదయ్‌కిరణ్ ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సుమారు 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు తరలిరానుండగా, గూడెం గోదావరితీరం జనసంద్రంగా మారనున్నది. సత్యనారాయణ స్వామి ఆలయానికి సమీపంలో గోదావరినది ప్రవహిస్తుండడంతో భక్తులు పు ణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. దీపారాధనలు, తులసీ పూజలు చేయనున్నారు. గోదావరిలో లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లు నిర్మించారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. గురువారం గోదావరి వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. నదిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం గుట్టపై ఉన్న స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నోముకున్నారు. ఆలయ ఆ వరణలో ఉన్న రావిచెట్టు వద్ద, గుట్టపైభాగంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిత్యహవనము, బలిహరణము, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది ఉన్నారు.