ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. 19వ తేదీన ప్రారంభం కాగా.. ఐదు రోజులుగా వైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటి సమస్యలు ఉన్న వారికి వెంట వెంటనే మందులు, రీడింగ్ గ్లాసెస్ ఇస్తున్నారు. దగ్గరి, దూరం చూపు, తలనొప్పి, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడేవారికి త్వరలోనే అద్దాలు అందజేయనున్నారు. ఇప్పటికే 600 జనాభా ఉన్న గ్రామాలు, వార్డుల్లో శిబిరాల నిర్వహణ పూర్తయింది. ఉదయం నుంచే ప్రజలు క్యాంపుల వద్ద బారులుదీరుతున్నారు. కాగా.. ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలు 66,332 మందికి చేయగా, రీడింగ్ గ్లాసెస్ 13,920 మందికి అందజేశారు. ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం11,939 మందిని రెఫర్ చేశారు.
– ఆదిలాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ)
కండ్లు సరిగ్గా కనిపించక ఏళ్లుగా పడుతున్న కష్టాలకు కంటి వెలుగు పరిష్కారం చూపుతున్నది. దవాఖానకు వెళ్లే ఓపిక లేని వృద్ధులకు అండగా నిలుస్తున్నది. ఐదు రోజులుగా కార్యక్రమం కొనసాగుతున్నది. ఐదు రోజుల్లో నిర్మల్ జిల్లావ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలు 13,753 మందికి, రీడింగ్ గ్లాసెస్ 2,860, ప్రిస్క్రిప్షన్ అద్దాలు 3,005 మందిని రెఫర్ చేశారు. మంచిర్యాల జిల్లాలో స్క్రీనింగ్ పరీక్షలు 18,527మందికి, రీడింగ్ గ్లాసెస్ 5,134, ప్రిస్క్రిప్షన్ అద్దాలు 3,172 మందిని రెఫర్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో స్క్రీనింగ్ పరీక్షలు 26,348 మందికి, రీడింగ్ గ్లాసెస్ 3,896, ప్రిస్క్రిప్షన్ అద్దాలు 4,896 మందిని రెఫర్ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్క్రీనింగ్ పరీక్షలు 7,704 మందికి, రీడింగ్ గ్లాసెస్ 2,030, ప్రిస్క్రిప్షన్ అద్దాలు 866 మందిని రెఫర్ చేశారు. రీడింగ్ గ్లాసెస్లను వెంటనే అందజేస్తూ.. దగ్గరి చూపు, దూరం చూపు, తలనొప్పి, కంటి నుంచి నీరు కారడం మొదలైన సమస్యలతో బాధపడేవారికి సమస్యను అనుసరించి ఇవ్వాల్సిన అద్దాలను త్వరలోనే అందజేయనున్నారు. కంటి వెలుగు కార్యక్రమం మొదలై ఐదు రోజులు అవుతున్నా శిబిరాల వద్ద జనాల రద్దీ కనిపిస్తూనే ఉంది. 600 జనాభా వరకు ఉన్న గ్రామాలు, వార్డుల్లో శిబిరాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకునేందుకు శిబిరాలకు వచ్చే వారిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
పరీక్షలు బాగా చేస్తున్నారు..
కంటి సమస్యలు ఉన్నవారికి సర్కారు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కండ్లు కనిపించని వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంది. పేదలు ప్రైవేట్ దవాఖానలకు పోయి పరీక్షలు చేయించుకోలేరు. ఆర్థికస్థోమత లేక అవస్థలు పడతారు. నేను కూడా కంటి వెలుగు శిబిరంలో ఈ రోజు పరీక్షలు చేయించుకున్నా. డాక్టర్ మిషన్ల కండ్లు పెట్టి చూసిండు. దూరం సూపు సరిగ్గా లేదని చెప్పిండు. మందులు ఇచ్చిండు. అద్దాలు వాడమని చెప్పిండు.
– గంగూబాయి, ఐదో వార్డు, ఆదిలాబాద్.
బాగా చూస్తున్నారు..
నాకు కండ్లలో దురద ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి కంటి వెలుగు శిబిరంలో చూపెట్టుకుందామని వచ్చా. డాక్టర్లు ఇక్కడ కండ్లను మిషన్లతో పరీక్షలు చేసిండ్రు. ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడిగారు. కొన్ని మందులు ఇచ్చి వాడమని చెప్పినారు. కండ్లు సరిగా కనపడని మా లాంటి వృద్ధులకు సర్కారు కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం సంతోషం. మా వాడ నుంచి బాగా మంది కంటి వైద్యశిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
– కళా భూదేవి, ఐదో వార్డు, ఆదిలాబాద్.
పైసా కూడా ఖర్చుకాలే..
కొన్ని రోజుల సంది కండ్లు సరిగా కనిపిస్తలేవు. తలనొప్పి కూడా వస్తంది. ఓ సారి మంచిర్యాలకు పోయి ప్రైవేట్ దవాఖానల సూపించుకున్న. రూ.3 వేల దాకా అయినయ్. అవి పెట్టుకుంటే తలనొప్పి తగ్గింది. కండ్లు కూడా మస్తు మంచిగ కనిపించినయ్. గవ్వి తెచ్చుకొని మస్తు రోజులైతంది. ఇప్పుడు సర్కారోళ్లు కంటి వెలుగు ద్వారా కొత్త కండ్లద్దాలు ఇస్తరని చెబితే వచ్చిన. పరీక్షలు చేసిన్రు. కొత్త కండ్లద్దాలు ఇచ్చిన్రు. పైసా కూడా ఖర్చుకాలే. ప్రైవేట్ దవాఖాన్ల కొనుక్కున్నట్లే మస్తు మంచిగ ఉన్నయ్. పేదోళ్లు బాగుండాలనుకుంటున్న గీ సీఎం కేసీఆర్ సల్లంగా ఉంటడు.
– పత్తి లావణ్య, నదీమాబాద్, కౌటాల.
డబ్బుల్లేక సూపించుకోలే..
నాకు మస్తు రోజుల సంది కండ్లుసక్కగా కనిపిస్తలేవు. ప్రైవేట్ దావఖానకు పోదామంటే పైసలు లేకుండే. గందుకే గిన్ని రోజుల సంది సూపించుకోలె. సర్కారోళ్లు మా ఊర్లో కంటి శిబిరం పెట్టిన్రని చెబితే ఇక్కడికి వచ్చి సూపించుకున్న. ఆధార్ కార్డు తీస్కొని.. కండ్లకు అద్దాలు పెట్టి అక్షరాలు సెప్పుమన్నరు. పరీక్షలు చేసినంక అద్దాలు ఇచ్చిండ్లు. ఇప్పుడు మస్తు మంచిగ కనిపిస్తున్నయ్. నయా పైసా లేకుండా కంటి పరీక్షలు చేసి చక్కటి అద్దాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంట.
– బాణాల సంటమ్మ, మార్కెట్ ఏరియా, కౌటాల
సర్కారు ఉచితంగా కండ్లద్దాలు ఇచ్చింది..
నాకు దగ్గరి చూపు సమస్య ఉంది. ఏదైనా పనిచేద్దామన్నా, చదువుదామన్నా కండ్లు సరిగ్గా కనిపించకపోయేవి. చాలా కష్టమయ్యేది. ప్రైవేట్ దవాఖానల్లో చూపించుకున్నా. పోయినప్పుడల్లా డాక్టర్ ఫీజు, టెస్టులు, మందులకు కలిపి రూ.1500 నుంచి రూ.2వేలు అయ్యేటివి. పైసలకు చాలా ఇబ్బంది అయ్యేటిది. ఒక్కోసారి డబ్బులకు ఇబ్బందయి చూపించుకోక పోయేది. సీఎం కేసీఆర్ సారు కంటి వెలుగు ద్వారా మా అంటోళ్లను ఆదుకుంటున్నడు. డబ్బులు కూడా తప్పుతున్నయ్. ప్రైవేట్లో చాలా పైసలవుతున్నయని సర్కారు ఉచితంగా నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరానికి వచ్చా. ఇక్కడ ఉచితంగానే పరీక్షించారు. మందులు, కండ్లద్దాలు కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది.
– తుంగపిండి మల్లేశ్, సంజీవయ్య కాలనీ, మంచిర్యాల.
ఏడాదిగా కండ్లు అసలే కనిపిస్తలేవు..
నాకు 67 ఏండ్లు నిండినయ్. ఇద్దరు కొడుకులు. కేసీఆర్ ఇచ్చే రూ.2 వేల పింఛన్ కొడుకులకే ఇస్తా. గతేడాది కాలంగా నాకు కండ్లు అసలే కనిపిస్తలేవు. దవాఖానకు పోయే తాహతు లేదు. కంటి సమస్యలు ఉన్నోళ్లకు ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తారని తెలిసి మనవడిని తీసుకొని ఇక్కడికి వచ్చిన. ఒక కన్ను అసలే కనిపిస్తలేదు. రెండో కన్నుకు అద్దం పెట్టి చూపిస్తే కొంచెం మంచిగనే కనిపించింది. అద్దాలు ఇస్తే ఒకటే కనిపిస్తది అన్నరు. ఆపరేషన్ చేస్తామని చెప్పారు సారు. నా కోసమే కేసీఆర్ ఈ శిబిరం పెట్టినట్లు ఉంది. నా కండ్లు మంచిగైతే సచ్చే వరకు ఆయనకు రుణపడి ఉంటా.
– వేముల లింగమ్మ, హమాలీవాడ, మంచిర్యాల.