గోదావరిఖని, అక్టోబర్ 6: సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్, టీబీజీకేఎస్ శ్రేణులు కదంతొక్కారు. సింగరేణి 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.4,701 కోట్ల వాస్తవ లాభాలపై 33 శాతం వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో ఒకరోజు శాంతియుత దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేసేందుకు యత్నించారు. టెంటు వేయకుండా అడ్డుతగిలారు. శాంతియుతంగా చేపడుతున్నామని చెప్పినా వినకపోవడంతో పోలీసులు, శ్రేణులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులతో మాజీ మంత్రి కొప్పుల, అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, రామగుండం, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నడిపెల్లి దివాకర్‌రావు, పుట్టమధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి వాగ్వాదానికి దిగారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని, అతిగా ప్రవర్త్తిస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్, బీఆర్ఎస్ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. నల్ల కండువాలు కప్పుకొని నిరసన తెలిపారు. కాగా, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు దీక్ష జరుగకుండా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయగా, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. సమీపంలోని టీబీజీకేఎస్ కార్యాలయానికి చేరుకొని, ఆవరణలో టెంటు వేసి దీక్ష చేపట్టారు. సింగరేణి, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
సింగరేణి లాభాల్లో వాటా పంపిణీలో యాజమాన్యం గోల్మాల్ చేస్తున్నదని, కార్మికుల శ్రమను దోచుకుంటున్నదని టీబీజీకేఎస్, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.4,701 కోట్ల నికర లాభాలు సాధించిందన్నారు. 33 శాతం వాటా అంటే కార్మికులకు రూ.1,550కోట్లు వస్తాయన్నారు. కార్మికులను మోసం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, జనరల్ సెక్రటరీ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కేంద్ర ఉపాధ్యక్షుడు బడికల సంపత్, ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్, ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య, పెట్టెం లక్ష్మణ్, మేడిపల్లి సంపత్, మల్రాజు శ్రీనివాసరావు, బడితెల సమ్మయ్య, ఎల్ వెంకటేశ్, పొలాడి శ్రీనివాసరావు, సత్యం, శేషగిరి, బీఆర్ఎస్ నాయులు డాక్టర్ రాజారమేశ్, నడిపెల్లి విజిత్‌రావు, రవి, కార్పొరేటర్లు గాదం విజయ, కృష్ణవేణి, విజయలక్ష్మీ, కవితా సరోజని, సంధ్యారెడ్డి ఉన్నారు.
సింగరేణి కార్మికులకు సంస్థ వాస్తవ లాభాలపై వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో శాతియుతంగా నిరసన దీక్ష చేపడితే పోలీసులతో భగ్నం చేయించడం సరికాదు. మరీ ఇంత దౌర్జన్యం పనికిరాదు. కాంగ్రెస్ అన్నివర్గాల ప్రజలను నయవంచన చేస్తోంది. సింగరేణి కార్మికులను ముంచుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు నికర లాభాలపై మాత్రమే లాభాల వాటాను పంచింది. వాటా శాతాన్ని ఒకటి రెండు శాతం పెంచుకుంటూ పోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 32శాతం వాటా చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న వాటా లెక్క తప్పుల తడకగా ఉంది. 33శాతం వాటా అని చెబుతున్నా వాస్తవానికి కార్మికులకు ఇస్తున్నది కేవలం 16.9శాతం మాత్రమే. కార్మికుల పొట్టకొట్టడం సరికాదు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల వాటా చెల్లించే వరకు పోరాటం ఆగదు. సంస్థ ప్రకటించిన నికర లాభం రూ.4,701 కోట్లపై కార్మికులకు 33శాతం వాటాగా రూ.1,551 కోట్లు చెల్లించాల్సిందే. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీయూసీలు అధికార కాంగ్రెస్‌కు తొత్తుగా మారిపోయాయి. కార్మికులకు న్యాయం చేయాల్సిన కార్మిక సంఘాలు పట్టించుకోకపోవడం సరికాదు. ఈ రోజు తాము గోదావరిఖనిలో శాంతియుత వాతావరణంలో నిరసన దీక్షకు పిలుపునిస్తే పోలీసులు వచ్చి అడ్డుకోవడం కాంగ్రెస్ నైజాన్ని తెలియజేస్తుంది.
సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలపై 33శాతం వాటాను చెల్లించాలని డిమాండ్ చేయడం తప్పా. శాంతియుతంగా ఒకరోజు నిరసన దీక్ష చేపడితే పోలీసులు అత్యుత్సాహం చూపి, అడ్డుకోవడం, టెంట్లు కూల్చివేయడం సరికాదు. అణిచివేయాలని చూస్తే ఆగేది కాదు. కార్మికులకు న్యాయం జరిగేదాకా కొట్లాడుతాం. సింగరేణి 2023-24 వార్షిక సంవత్సరంలో రూ.4,701 కోట్ల నికర లాభాలు సాధించింది. దానిపై 33 శాతం అంటే రూ.1,551 కోట్లు కార్మికులకు వాటాగా ఇవ్వాలి. కానీ కేవలం 16.9 శాతం మాత్రమే ఇస్తూ కార్మికులను మోసం చేయాలని చూస్తే ఊరుకోం.