సిర్పూర్(టీ), జూన్ 13 : సిర్పూర్(టీ) అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఇటుకలపాడు అటవీ ప్రాంతంలోని 250 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు గ్రామస్తులు సహకరించాలని కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పలకొండ అన్నారు. గురువారం ఇటుకలపాడులో గురువారం ఆర్డీవో సురేశ్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎఫ్ఆర్వో పూర్ణచందర్ రావు, సిర్పూర్(టీ) ఎస్ఐ దీకోండ రమేశ్‌లతో కలసి గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటుకలపాడు గ్రామం పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందని, పులుల సంచారానికి అవాంతరాలు తొలగించేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇటుకలపాడులో గతంలో 250 హెక్టార్లలో మొక్కలు నాటామని, ఈసారి మరో 250 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, అర్హులైన గ్రామస్తులకు జీవనం సాగించేందుకు అటవీ ప్రాంతంలో కొంత భూమి ఇవ్వడానికి అటవీ అధికారులు సంసిధ్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై రెండు, మూడు రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వోలు మోహన్, సిర్పూర్(టీ) రేంజ్ అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.