ఎదులాపురం, మార్చి 19 : ఆదిలాబాద్ జిల్లావాసుల చిరకాల ఆకాంక్ష అయినటు వంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాల్సిందే అని, ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పునరుద్ఘాటించారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను బుధవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రారంభించారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఆవశ్యకత, కేంద్రం అవలంబిస్తున్న విధానాలు, స్థానిక ప్రజాప్రతినిధుల వైఖరిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని నేతలు ముక్తకంఠంతో నినదించారు.
ఈ సందర్బంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సిమెంట్ కంపెనీని తెరవాలని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక మార్లు కేంద్రానికి విన్నవించామని గుర్తు చేశారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. కేంద్రం స్పష్టమైన హామీ ప్రకటించేలా చూడాలని హితువు పలికారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఫ్యాక్టరీని తుకు కింద అమ్మేసేందుకు టెండర్‌ను ప్రకటించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఈ విషయంపై దృష్టి సారించాలని, అవసరమైతే అఖిల పక్షం తరఫున వారితో కలిసి కేంద్ర మంత్రులను కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సాధన కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో-కన్వీనర్లు విజ్జగిరి నారాయణ, వెంకట్ నారాయణ, లంక రాఘవులు, అరుణ్ కుమార్, ముడుపు ప్రభాకర్ రెడ్డి, కస్తాల ప్రేమల, లోకారి పోశెట్టి, జగన్ సింగ్, ఈశ్వర్ దాస్, అల్లల్ అజయ్, స్వరూప పాల్గొన్నారు.