ఆదిలాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని, సమస్యలు పట్టించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫసల్ బీమా గడువు జూలై 31తో ముగియగా.. ఇప్పుడు ఫసల్ బీమా అమలు చేయాలంటూ బీజేపీ నాయకులు కలెక్టర్కు వినితిపత్రం ఇవ్వడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు పత్తి రైతుల సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నాయకులు రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
గతేడాది సోయాబిన్ కొనుగోళ్లను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలతో మాట్లాడి పెంచినట్లు ప్రగల్భాలు పలికిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన సొంత గ్రామం ఆడ రైతులు పంటలను విక్రయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లలో తేమ, పంటల కొనుగోలు పరిమితిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకపోతే వారి భరతం పడుతామని సూచించారు.
సోయా రైతులు పంటను విక్రయించుకోవాలంటే వేలిముద్ర వేయాల్సిన నిబంధన ఎత్తివేయాలని మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. రైతులకు సౌకర్యంగా ఉన్న ఓటీపీ విధానాన్ని అమలు చేయాలన్నారు. వేలి ముద్రలు పడక రైతులు మార్క్ఫెడ్ కేంద్రాల్లో పంటను అమ్ముకోలేకపోతున్నారని, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు నష్టపోకుండా తడిసిన పంటను కొనుగోలు చేసిందన్నారు. పత్తి పంటలో తేమ, పంట పరిమితి విషయంలో నిబంధనలు విధించలేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అలాల అజయ్, విజ్జగిరి నారాయణ, గండ్రత్ రమేశ్, రాజన్న, గంగయ్య, స్వరూపరాణి, దమ్మపాల్, ప్రశాంత్, దాయానంద్, కలిమ్, తదితరులు పాల్గొన్నారు.