ఆదిలాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) : పత్తి ధరల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఏ మాత్రం అవగాహన లేదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తాను మంగళవారం సీసీఐ అధికారులను కలి సి కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. గుజరాత్ , రాజస్థాన్, హర్యాన రాష్ర్టా ల్లో పత్తి రైతులు సాగు చేసిన పంట వెరైటీలకు అనుగుణంగా ప్రైవేటు వ్యాపారులు ధరలను చెల్లిస్తారని తాను మాట్లాడానన్నారు. తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ వక్రీకరించారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు బాధను, ఆవేదన కలిగించాయన్నారు. ఎమ్మెల్యే తెలివితక్కువ మాటలు మానుకోవాలని సూచించారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నట్లు తెలిపారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లో రైతులు పండించే పత్తి కంటే ఆదిలాబాద్ రైతులు సాగు చేసే పత్తి నాణ్యత కలిగి ఉంటుందన్నారు. పత్తి ధర ఎక్కువ కలిగించే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలు కలెక్టర్ సమక్షంలో వ్యాపారులు, రైతు సంఘాల నాయకులతో ఎందుకు సమావేశం ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన రోజు స్థానికంగా ఉండి రైతులకు మంచి ధర కల్పించేలా ప్రైవేటు వ్యాపారులను ఒప్పించాల్సిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం పత్తి కొనుగోళ్ల ప్రారంభం రోజు మార్కెట్ యార్డుకు వచ్చి మంచి ధర ఇప్పించినట్లు పేర్కొన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ రోజు రైతులు ధర్నాలు చేయలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాత్రి వచ్చి ఒక్కరే వ్యాపారులతో చర్చించి ధర నిర్ణయించారన్నారు. ధర విషయంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కలెక్టర్‌తో కలిసి రైతుల సంఘాల నాయకులతో కలిసి ప్రైవేటు వ్యాపారులతో చర్చించి ధర నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో ఎయిర్‌పోర్టు, సిమెంటు పరిశ్రమ విషయంలో పాయల్ శంకర్ అబద్ధాలు ఆడారన్నారు.
గతంలో ఫసల్ బీమా విషయంలో ఆందోళనలు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడడానికి భయపడుతున్నారన్నారు. దమ్ముంటే రైతు సమస్యలపై ధర్నా చేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేశ్, రౌత్ మనోహర్, నర్సింగారావు, మెట్టు ప్రహ్లాద్, కుమ్ర రాజు, జగదీశ్, గండ్రత్ రమేశ్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.