ఆదిలాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్‌గున్యా, విష జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క వైద్యసేవల విషయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించలేదని, ప్రజల ఆరోగ్యంపై పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్రణాళికలతో వ్యాధుల నియంత్రణను సమర్థవంతంగా నివారించినట్లు తెలిపారు. డెంగ్యూ, మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నా అధికారులు సరైన లెక్కలు చూపడం లేదన్నారు. జిల్లాలోని వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలోని రిమ్స్‌తో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, మందుల కొరత ఉందన్నారు. మెడికల్ షాపుల్లో తెచ్చుకునేందుకు ప్రిస్కిప్షన్ రాసే వైద్యులపై వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాలపై వైద్యశాఖ మంత్రికి అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల కిందట జిల్లాలో 25 మంది వైద్యులను నియమించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా ఒక్క డాక్టర్‌నూ నియమించలేదని విమర్శించారు.
పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా చాలా వాటిల్లో ఒక్కరే ఉన్నారని తెలిపారు. పట్టణాలు, పల్లెల్లో అపరిశుభ్రత కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా కృషి చేసిందని తెలిపారు. జిల్లాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేశ్, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగరావు, సొజిదొద్దీన్, అలాల అజయ్, విజ్జగిరి నారాయణ, సెవ్వా జగదీశ్, కుమ్ర రాజు, నవాతే శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.