ఎదులాపురం, అక్టోబర్ 17 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని బీసీ, కుల సంఘాలు, బీఆర్ఎస్, తదితర పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వాడుకుంటున్నాయని, రిజర్వేషన్లపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మండిపడ్డారు. శనివారం ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ద్వంద వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని అమలు చేయడంలో విఫలమై బంద్‌కు మద్దతు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అటు బీజేపీ ఎంపీలు ఏ రోజైనా రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారా ? అని ప్రశ్నించారు. బీసీ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నదని, బంద్ విజయవంతమయ్యేందుకు ప్రతి ఒకరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, ఇజ్జగిరి నారాయణ, సాజిదుద్దీన్, పందిరి భూమన్న, వేణు యాదవ్, కొండ గణేశ్, ఉగ్గే విఠల్, బట్టు సతీశ్, దేవదాస్, ఖలీం, సూర్యకాంత్, ఖాదీర్, ఆలం పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 17 : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగే బీసీ బంద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రేపు బీసీ బంద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కుల, ప్రజా సంఘాల నాయకులు పూర్తి మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు.
లోకేశ్వరం/భైంసా, అక్టోబర్, 17 : నేడు శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, విలాస్ గాదేవార్ వేర్వేరు కార్యక్రమాల్లో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని విమర్శించారు. రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానాల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల సాధన కోసం, కాంగ్రెస్, బీజేపీలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 17 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అగ్ర కులాల వారు ఓర్వలేక హైకోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ రాజకీయ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలను ఎదగకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా వెనుకకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలుకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, బంద్‌లు పాటిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలుపాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు అనుముల భాస్కర్, కత్తి కిరణ్, అశోక్ నాయక్, ప్రశాంత్, శివాజీ గౌడ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.