ఆదిలాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ) ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో రైతులను మోసం చేశాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సర్కారు అమలు చేసిన రైతు బీమా పథకానికి ప్రభు త్వం ప్రీమియం చెల్లించకపోవడంతో చనిపోయిన రై తు కుటుంబాలకు సాయం అందడం లేదన్నారు. జిల్లాలో ఏప్రిల్ 22వ తేదీన జొన్నల కొనుగోళ్లు ప్రారంభం కాగా పంటను విక్రయించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయలేదని తెలిపారు.
నాట్లు వేసే నాటికి రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటన చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. నాట్లకు ముందుగానే పత్తి, కంది, సోయా పంటలు వేస్తారని, వారు పెట్టుబడి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ప్రశ్నించారు. విత్తనా లు, ఎరువుల కోసం రైతులు కమిషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారన్నారు. జిల్లాలో యాసంగిలో 1.67 లక్షల మందికి రైతు భరోసా రావాల్సి ఉండగా.. 4 ఎకరాల వరకు 90 వేల మందికి మాత్రమే వచ్చాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 45 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామనడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ప్రారంభంలో జిల్లాలో 1,02,567 మంది లబ్ధిదారులు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 65 వేలకు చేరిందన్నారు. ఈ పథకాన్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేస్తామని చెప్పిన కేంద్రం మాట మర్చిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన లాంటి పథకాలను రద్దు చేసిందని, పదేండ్ల కింద ఉ న్న ఎరువుల ధరలు ఇప్పుడు రెండింతలు పెరిగాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేశ్, కుమ్ర రాజు పటేల్, రాజన్న, ప్రశాంత్, ఎస్కే, ఖలీం పాల్గొన్నారు.