ఆదిలాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుసున్న వర్షాల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి. పెన్‌గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి. చెరువులు మత్తడి దుంకడంతో పొలాలు దెబ్బతిన్నాయి.
చేతికొచ్చే దశలో ఉన్న పంటలు వరదల కారణంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతలకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ పర్యటించి వరద నష్టాన్ని తెలుసుకున్నారు. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కల్వర్లు, ఇండ్లను పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్, బేల మండ లాల్లో పర్యటించారు. జైనథ్ మండలంలోని కరంజి, కాప్రి, ఉమ్రి.. బేల మండలంలోని సాంగిడి, బెదోడ, మాంగ్రూడ్ గ్రామాల్లో నీట మునిగిన పంటను పరిశీలిం చారు. పెన్‌గంగా ప్రవాహంతోపాటు వాగులు పొంగడం తో రైతులు భారీగా పంటలను నష్టపోయారన్నారు. రైతులు అధైర్య పడొద్దని బీఆర్ఎస్ అన్నదాతల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వం కౌలు రైతులకు రూ.15 వేల సాయం, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు అందించాలని డిమాండ్
– మాజీ మంత్రి జోగు రామన్న
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తాంసి మండలంలోని కప్పర్ల మోడ్.. భీంపూర్ మండలంలోని అర్లి గ్రామంలో పర్యటించారు. పెన్‌గంగా ప్రవాహం వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తాంసి మండలంలోని కప్పర్లమోడ్లో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. భీంపూర్ వాగులో నడుచుకుంటూ అర్లీకి వెళ్లి పంటలు, నష్టపోయిన రైతులను పరమర్శించారు. పంట చేతికొచ్చే దశలో ఉన్నందున ప్రభుత్వం ఎకరాకు రూ.40 వేల పరిహారం చెల్లించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం వివరాలను సేకరించాలని సూచించారు. వర్షాలతో పాడయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధింత శాఖల అధికారులను ఆదేశాలు జారీ చేశారు.
– బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్.
జైనథ్, సెప్టెంబర్ 3 : వర్షాల వల్ల పెన్‌గంగా ఉధృతి పెరిగింది. నాకున్న ఐదెకరాల పత్తి పంట పూర్తిగా వరదల వల్ల నీట మునిగింది. మరో పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశా. అది కూడా నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. కాంగ్రె స్ సర్కారు పంట నష్ట పరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నా.
– మేర ఊశన్న, రైతు, కరంజి, జైనథ్ మండలం.