ఆదిలాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లో విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనల్లో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చిన హామీలనే విజయోత్సవ సభలో మరోసారి చెప్పారన్నారు. ఏయిర్పోర్డు ఏర్పాటు, యూనివర్సిటీ మంజూరు, సీసీఐ ప్రారంభం, జిల్లాను దత్తత తీసుకుంటామనే విషయాలు తప్ప కొత్తగా ఎలాంటి హమీలు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి గాలి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం సభలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జోకర్లా, బ్రోకర్లా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. నిధులు లేక గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనురుధ్ రెడ్డి చెప్పగా.. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాత్రం సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో జిల్లాలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీలను ఈ సభలో ఎమ్మెల్యే ఎందుకు గుర్తు చేయలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్ల కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దిష్టిబొమ్మలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కార్యకర్తలు దహనం చేసేందుకు ప్రయత్నిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యే వైఖరి మాత్రం వ్యతిరేకంగా వ్యవహరించడం గమనార్హమన్నారు. సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అమ్మడానికి లోపాయికారి ఒప్పందం మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాయల్ శంకర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని మాట్లాడడం కనీస అవగాహన లేకపోవడానికి నిదర్శనమన్నారు.
ఇటీవల బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు రూ.3.66 లక్షల కోట్ల అప్పులున్నాయని ఆర్థిక శాఖ మంత్రి సమాధానం ఇవ్వడం ఆయనకు తెలియదా ? అని ప్రశ్నించారు. నరేంద్రమోడీ ప్రధానీ అయినప్పుడు దేశంలో రూ.56 లక్షల కోట్ల అప్పులు ఉండగా ఇప్పుడు రూ.186 లక్షల కోట్ల అప్పులయ్యాయన్నారు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గతంలో సీసీఐని ప్రారంభించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా స్పందించలేదన్నారు. సీసీఐ అమ్మకాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, మెట్టు ప్రహ్లాద్, అజయ్, గండ్రత్ రమేశ్, జగదీశ్, దాసరి రమేశ్, పండ్ల శ్రీనివాస్, జంగిలి ప్రశాంత్, నవాతే శ్రీనివాస్, రఘు, వేణు, దయానంద్ ఉన్నారు.