ఆదిలాబాద్, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ): ఈ నెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులు సన్నద్ధమయినట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి 10వేల మంది వరంగల్ సభకు హాజరవుతారని ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
వరంగల్ సభకు పట్టణం, పల్లె తేడా లేకుండా అంద రూ హాజరవుతారని ఇందుకోసం రవాణా సౌకర్యం కల్పించామన్నారు. జిల్లా నుంచి 30 ఆర్టీసీ బస్సులు 150 క్రూజర్లుతో పాటు సొంత వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, తమ అంచనాలు మించి సభకు తరలిరానున్నట్లు చెప్పారు. ఎండల తీవ్రత కారణంగా ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలో ఇప్పటికే గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి వరంగల్‌కు వచ్చే వారి వివరాలు సేకరించామని, ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలకు ఇన్చార్జిలను నియమించామన్నారు. వారు కార్యకర్తలను తీసుకుపోయి క్షేమంగా తిరిగి తిరిగివచ్చేలా బాధ్యతలు తీసుకుంటారన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డులు ఉండగా వార్డుల వారీగా బస్సులు అందుబాటులో ఉంచామని ఉదయం టిఫిన్స్ చేసిన తర్వాత రాంలీలా మైదానం నుంచి బస్సులు వరంగల్‌కు బయలుదేరుతాయన్నారు.
కాంగ్రెస్ 15 నెలల పాలనపై ప్రజలు విసుగు చెందారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలు మోసం చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు నిలిచిపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, సభ తర్వాత కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.