రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడమేగాక వ్యవసాయానికి కావాల్సినంత సరుకుల స్టాక్‌ను అందుబాటులో ఉంచుతున్నది. సమైక్య రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ మన కర్షక లోకం బీఆర్ఎస్ సర్కారు ముందు చూపుతో రంది లేకుండా పంటలు పండిస్తున్నది. ఇక పక్కనున్న మహారాష్ట్రలో ఎరువులు, విత్తనాల కొరత వేధిస్తుండగా, అక్కడి రైతాంగం మన దగ్గరికి క్యూ కడుతున్నది. ధరల్లోనూ వ్యత్యాసం ఉండగా, నిత్యం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నది. పొరుగు రాష్ట్రం నుంచి చింతలమానేపల్లికి వచ్చిన అన్నదాతలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, సీఎం కేసీఆర్ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.
– చింతలమానేపల్లి, జూలై 31
చింతలమానేపల్లి, జూలై 31 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల కోసం చేపట్టిన ప్రభుత్వ పథకాలు రైతును రాజును చేస్తున్నాయి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, పుష్కలంగా ఎరువులు, విత్తనాలు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, అందుబాటులో వ్యవసాయశాఖ అధికారుల సలహాలతో తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా నిరూపించుకుంటున్నది. కానీ, పక్కనే ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. అక్కడి రైతులను పట్టించుకునేవారు లేకపోవడంతో భూములన్నీ బీడువారుతున్నాయి. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా ప్రజలు, రైతులు కేసీఆర్‌లాంటి పాలనను కోరుకుంటున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. విద్యుత్ పంప్సెట్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరుస్తున్నది.
ఇక్కడికే వచ్చి కొనుక్కుంట
నా పేరు దిగంబర్. మాది మహా రాష్ట్రలోని చింతల్‌పేట్ గ్రామం. నాకున్న ఐదెకరాల్లో పత్తితో పాటు వరి వేస్త. నేను పత్తి విత్తనాలు, ధాన్యంతో పాటు ఎరువులను తెలంగాణలోని చింతలమానేపల్లికి వచ్చి కొనుక్కుంట. మహారాష్ట్ర కంటే ఇక్కడే రేట్లు తక్కువగా ఉన్నయ్. అన్ని రకాల మందులు దొరుకుతయి. అందుకే ఇక్కడికి వచ్చి కనుక్కొని వెళ్తా. ఇక్కడున్న రైతు సంక్షేమ పథకాలు మా దగ్గర లేవు. ఈ ప్రభుత్వం మా దగ్గర కూడా ఉంటే మంచిగుండు. రైతులు రంది లేకుంట బతికేటోళ్లు.
ఉమ్మడి రాష్ట్రంలో మనం.. ఇప్పుడు ‘మహా’ రైతులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో రైతులు అరిగోస పడ్డారు. యూరియా, డీఏపీ కోసం పొద్దు పొడవక ముందు ఇంటి నుంచి పాస్ బుక్‌లతో బయలుదేరి వెళ్లి కేంద్రాల వద్ద చెప్పులు వరుసలో పెట్టేవారు. తోపులాటల నడుమ ఎట్లనో అట్ల ఒకటో.. రెండో బస్తాలు తెచ్చుకొని పంటకు జల్లుకునే పరిస్థితి ఉండేది. పదేళ్ల క్రితం ఎరువులు విత్తనాల కోసం మన రైతులు పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు నాటు పడవల మీద వెళ్లి ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు కొనుగోలు చేసి తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో రైతులు రంది లేకుండా వ్యవసాయం చేస్తున్నారు.
ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవడమేగాక.. సకాలంలో రైతులకు అందిస్తున్నది. కావాల్సినంత స్టాక్ అందుబాటులో ఉంచుతున్నది. మహారాష్ట్రలో విత్తనాలు, ఎరువుల కొరతకు తోడు ధరల్లో భారీగా వ్యత్యాసం ఉండగా, అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. అదీ.. కూడా ఎలాంటి కష్టం లేకుండా కేవలం గంటలోపు ఎరువులు, విత్తనాలు వాహనంలో నింపుకుని కాలికి మట్టి అంటకుండా ప్రాణహిత నదిపై కట్టిన హై లెవల్ బ్రిడ్జిపై నుంచి దర్జాగా వెళ్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఎరువులు, విత్తనాలు కొనుక్కునేందుకు వచ్చిన రైతులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, తెలంగాణ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ ప్రధాని అయితే భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుందని, రైతులంతా సంతోషంగా ఉంటారని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అన్నీ దొరుకుతయ్
నాకు మా ఊరిలో పదెకరాలు ఉంది. మొత్తం పత్తి సాగుచేస్త. తెలంగాణలో అన్నీ దొరుకుతయి. పైగా ధరలు కూడా తక్కువగా(సరుకులను బట్టి రూ. 100 నుంచి రూ. 200 వరకు వ్యత్యాసం) ఉంటయి. విత్తనాలతో పాటు ఎరువులు, మందులు ఇక్కడికే వచ్చి కొనుక్కొని వెళ్త. తెలంగాణ రైతులు అదృష్టవంతులు, సీఎం కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు. అక్కడ మమ్ముల పట్టించుకున్నోళ్లు లేరు. ఇక్కడున్నన్ని సౌలతులు మా దగ్గర లేవు. బీఆర్ఎస్ పార్టీ మా దగ్గర కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటున్న. కేసీఆర్ సీఎంగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం.
– శ్రీకాంత్, యువరైతు, మహారాష్ట్ర
సమైక్య రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండే
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులకు విత్తనాల, ఎరువుల కొరత తీవ్రంగా ఉండేది. అప్పుడు మేము పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రకు నాటు పడవల్లో వెళ్లి విత్తనాలు, మందులు కొనుక్కొని వచ్చేవాళ్లం. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులకు మేలు జరుగుతుంది. అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి కావాల్సినన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర రైతులే మన దగ్గరికి వచ్చి ఎరువులు, విత్తనాలు కొనుక్కుని పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గూడెం -అహేరి వంతెన నిర్మించడంతో రవాణా సైతం సులువైంది.
– డోకే రాజన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కాగజ్‌నగర్