ఎదులాపురం, ఆగస్టు 20 : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్నారని, కానీ వారిపై ప్రభుత్వం నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడం సరికాదని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో అఖిల పక్షం రైతు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయా రైతు, పార్టీల నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
రైతులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పిందన్నారు. రుణమాఫీ కాని రైతులు బాధతో సీఎంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడితే వారిపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడం హేయమైన చర్య అని అన్నారు. పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల పక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి, గోవర్ధన్, పోశెట్టి, ఆయా పార్టీలు, సంఘాల నాయకులు దర్శనల మల్లేశ్, కిరణ్, జగన్, వెంకటనారాయణ, సచిన్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అఖిల పక్షం ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న జిల్లా రైతులు ఎదుర్కొంటున్న రుణమాఫీ సమస్యలపై కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలాంను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశా రు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీ తో పాటు కలెక్టర్‌కు వివరించారు. రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు.
కొంతకాలంగా రైతులు చేను పనులు మానేసి బ్యాంకుల చుట్టూ రుణమాఫీ కోసం ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ రుణమాఫీలో కొంత వరకు చిన్నపాటి లోపాలు తలెత్తాయని త్వరలో వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి, వెంకట్ నారాయణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జగన్, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ రైతు నాయకులు రమేశ్, లోకారి పోశెట్టి, మార్కెట్ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగ్, సతీశ్ పాల్గొన్నారు.