మంచిర్యాల, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలోని చెరువుల ఆక్రమణలపై కొరఢా ఝుళిపిస్తున్న యంత్రాంగం ‘శనిగకుంట’పై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సర్వే చేసి ఎఫ్టీఎల్, బపర్జోన్లో పోసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆయకట్టు రైతులు, స్థానికులు ఎప్పటి నుంచో వేడుకుంటున్నా, ఏమాత్రం స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
మట్టి పోయడం వల్లే..
చెన్నూర్‌లోని శనిగకుంట మత్తడి పేల్చివేత ఘటన తర్వాత పోలీసులు నిర్వహించిన ఏకైక ప్రెస్మీట్లో కీలకాంశాలు వెల్లడించిన విషయం విదితమే. శనిగకుంట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని 15.20 ఎకరాల్లో మట్టి పోయడం వల్లే వరద చెరువులోకి వెళ్లలేక ఇళ్లలోకి చేరిందని, ఆ కారణంగానే మత్తడి పేల్చివేశారని స్వయంగా పోలీసులే ప్రకటించారు. ఆపై ఆ 15.20 ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయి. ఎవరెవరు కొనుగోలు చేశారు.
అనే వివరాలను పేర్లతో సహా వెల్లడించారు. ఆ తర్వాత కొందరు అధికార పార్టీ లీడర్లు కీలక సూత్రధారులన్న విషయం తేటతెల్లమైంది. అరస్టైన నలుగురిని విచారించిన సమయంలోనూ వారి పేర్లు బయటికి రావడంతో పోలీసులు అరెస్టు చేసి.. నాటకీయ పరిణామాల మధ్య వారిని విడిచి పెట్టారు. కొందరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఆ పరారీలో ఉన్న ఇద్దరిని గత నెల 27న అరెస్టు చేసినట్లు సమాచారముంది.
అధికారులు పట్టించుకోలే..
జిల్లాలోని చెరువుల విషయంలో అక్రమ నిర్మాణాలపై కొర ఢా ఝుళిపిస్తున్న అధికారులు మరి శనిగకుంట చెరువు వి షయంలో ఎందుకు వెనుకడగు వేస్తున్నారంటూ స్థానికు లు, ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. కుమ్మరికుంట మా దిరిగానే శనిగకుంట చెరువును సర్వే చేసి ఎఫ్టీఎల్, బపర్జోన్లో పోసిన మట్టిని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శనిగకుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టాదారులు మ ట్టి పోస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోకుండా నో టీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2022 జూన్‌లో కొందరు పట్టాదారులు శనిగకుంటలో మట్టి పోసి చెరువు సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయకట్టు రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు చెరువును పరిశీలించిన అధికారులు సర్వే నంబర్ 355, 356,357,358, 359లలో మట్టి పోసి చెరువు ప్రవాహన్ని అడ్డుకున్నారని, పోసిన మట్టిని తొలగించాలని, చెరువును యధాస్థితికి తేవాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పట్టాదారులైన మంచాల రాజబాపునకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసును తదుపరి చర్యల కోసమని తహసీల్దార్‌కు పం పించారు. ఇదయ్యాక కూడా పట్టాదారు పైన చెప్పిన సర్వే నంబర్లలో రాత్రికి రాత్రి మట్టి తెచ్చి పోస్తున్నారని తెలియడంతో పోలీసులకు సైతం అధికారులకు ఫిర్యాదు చేశారు.
లైట్‌గా తీసుకున్నరు
కాగా, ఈ వ్యవహారంలో నోటీసులు ఇవ్వడం, చర్యలకు తహసీల్దార్‌కు సిఫార్సు చేయడం తప్ప తాము ఏమీ చేయలేమని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ హద్దులను నిర్ణయించాలన్నా.. అందులో ఉన్న మట్టిని తొలగించాలన్నా.. అది రెవెన్యూ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. ఇలా ఇరిగేషన్ శాఖ, రెవెన్యూశాఖల మధ్య సమన్వయలోపంతోనే శనిగకుంటను అధికారులు లైట్ తీసుకున్నారు. ఈ ఫిర్యాదుల వ్యవహారం రెండేళ్లనుంచి నడుస్తున్నా అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని తెలిసింది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్16న శనిగకుంట మత్తడిని డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్‌తో పేల్చి ధ్వంసం చేశారు. దీంతో ఆలస్యంగా నిద్రలేచిన ఇరిగేషన్ అధికారులు చెరువులో ధ్వంసమైన మత్తడిని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనిగకుంట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో పోసిన మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్ సెప్టెంబర్ 21న తహసీల్దార్ మల్లికార్జున్‌కు లేఖ రాశారు.
దీనిపై తహసీల్దార్ మల్లికార్జున్ వివరణ కోరగా.. పట్టాదారులు తమ పట్టా భూముల్లో పోసిన మట్టి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందో లేదో సర్వే చేయాలన్నారు. సర్వేలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో మట్టి పోసినట్టు తేలితే తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, రైతులు ఫిర్యాదు చేసినప్పుడే విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఉంటే మత్తడి పేల్చే వరకు వచ్చేది కాదని స్థానికులు, ఆయకట్టు రైతులు అంటున్నారు. అధికారుల అలసత్వంతోనే ఇంత వరకు వచ్చిందని మండిపడుతున్నారు.
బాపురెడ్డి భూమిపై తప్పుడు లెక్కలు
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు శనిగకుంట బఫర్‌జోన్‌లోని భూమిని గోదావరిఖనికి చెందిన వ్యక్తి నుంచి చెన్నూర్‌లోని కొందరు కొనుగోలు చేశారు. అదే భూమిని కాంగ్రెస్ లీడర్ గొడిసెల బాపురెడ్డికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 15.20 ఎకరాల్లో 4.20 ఎకరాలు బాపురెడ్డి పేరుమీద రిజిస్ట్రేషన్ సైతం చేశారని చెప్పారు. వాస్తవానికి బాపురెడ్డి పేరుపై కాకుండా ఆయన కొడుకు గొడిసెల ప్రవీణ్‌కుమార్ పేరుమీద సర్వే నంబర్లు 360/1/3లో ఎకరం ఐదు గుంటలు, 360/1అ/3లో 11 గుంటలు, 360/2/3లో ఎకరం ఐదు గుంటలు, 360/6లో ఎకరం ఐదు గుంటలు, 360/ఆ/3లో ఎకరం ఐదు గుంటలు దాదాపు 4 ఎకరాల 31 గుంటలు ఉన్నట్లు ధరణిలోనే చూపిస్తున్నది.
మరి పోలీసులు 4.20 ఎకరాలే బాపురెడ్డి పేరు మీదకు రిజిస్ట్రేషన్ అయినట్లు తప్పుడు లెక్కలు చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. పైగా సర్వే నంబర్ 360 అనేది శనిగకుంటను ఆనుకొని ఉన్న తొలి సర్వే నంబర్. చెరువుకు ఓ పక్కన ఉన్న ఈ సర్వే నంబర్ తర్వాతే పోలీసులు వెల్లడించిన వివరాల్లోని మిగిలిన సర్వే నంబర్లు వస్తున్నాయి. అవే ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉంటే.. ఈ సర్వే నంబర్ కూడా కచ్చితంగా ఉండాలి. కానీ ఆ భూములు ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పైగా మొన్నటికి మొన్న బాపురెడ్డి సహా మరో ఇద్దరిని అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు కాసేపటికే వదిలేశారు.
ఈ నేపథ్యంలో ఈ లీడర్‌కు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది అర్థం కాకుండా పోయింది. అటు ముందే చర్యలు తీసుకోవడంలో విఫలమైన ఇరిగేషన్‌శాఖ అధికారులతో పాటు భూములను రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ శాఖ, తప్పుడు లెక్కలు చెప్పిన పోలీసు శాఖపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ కేసులో నిజానిజాలు వెల్లడించి, శనిగకుంట మత్తడి పేల్చివేతకు కారకులైన వారిని అదుపులోకి తీసుకోకపోతే స్థానిక జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు పోలీసు శాఖకు చెంపపెట్టుగా మారొచ్చనే చర్చ స్థానికంగా నడుస్తున్నది.