ఆదిలాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో సాగైన పంటలు నీరు అందకపోవడంతో వట్టిపోతున్నాయి. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో జొన్న, శెనగ, పల్లి, గోధుమ పంటలు సాగయ్యాయి. అధికంగా 70 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. ప్రస్తుతం జొన్న మంచి ఎదుగుదల దశలో ఉంది. కంకి వచ్చి విత్తులు రావాల్సి ఉండగా నీరు అవసరం అవుతున్నది. భూగర్భ జలాలు అడుగంటడం, పంటను రక్షించుకునేందుకు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో నష్టపోవాల్సి వస్తున్నది.
చెరువుల నుంచి పంటలకు నీరు అందించాల్సిన కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో నీరంతా వృథాగా పోతున్నది. దీంతో చేసేదేమీ లేక తమ చేలలోనే పశువులను వదులుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వేసిన పంటలకు సాగునీరు అందక తమ కండ్ల ముందే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పశువులను మేపుతున్నామని రైతులు అంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
నేను ఆరెకరాల్లో జొన్న సాగు చేశా. భూగర్భ జలాలను ఇంకిపోవడంతో బోరు సరిగా పోయడం లేదు. ఏటా యాసంగిలో ఆరెకరాలకు 12 నాజళ్ల ద్వారా నీటిని అందిస్తా. ఇప్పుడు తొమ్మిది నాజళ్లు పెట్టినా నీరు పోయడం లేదు. బోరు ఎప్పుడు ఆగిపోతుందో తెలియని దుస్థితి. కంకి దశలో ఉన్న జొన్నకు మరో రెండు తడులు అవసరమవుతాయి. కానీ.. పూర్తిస్థాయిలో నీరు అందించే పరిస్థితి లేదు. మరో వారం రోజుల వరకు బోర్లో నీళ్లు ఉండే అవకాశాలున్నాయి. పంట చేతికొస్తుందనే నమ్మకం లేదు. కజ్జర్ల చెరువు కాలువ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉన్నా.. అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు రావడం లేదు. అధికారులు స్పందించి కాలువ ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలి.
– నవీన్, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం
నేను ఆరెకరాల్లో జొన్న సాగు చేశా. సాగు కోసం రూ.1.25 లక్షల అప్పు చేశా. ప్రస్తుతం జొన్న కంకి దశలో ఉంది. మరో రెండు తడుల నీరిస్తే దిగుబడి బాగా వస్తుంది. నేను నాకున్న బోరు ద్వారా గతేడాది 12 నాజళ్లతో పుష్కలంగా నీరు అందించి మంచి దిగుబడులు పొందా. ఈ ఏడాది మా గ్రామంలో చాలా మంది రైతుల బోర్లలో నీరు అడుగంటిపోయింది. దీంతో బోర్ల నుంచి నీళ్లు వస్తలేవు. ప్రస్తుతం ఆరు నాజళ్ల ద్వారా నీరు ఇస్తుండగా సరిపోవడం లేదు. బోరు నుంచి నీరు తక్కువగా వస్తుంది. మరో వారం, పది రోజుల్లో బోరు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో చేతికొచ్చే పంట నష్టపోయే దుస్థితి నెలకుంది. మా గ్రామంలో చెరువు కాలువ మరమ్మతులు చేస్తే పంటలకు నీరు అందుతుంది.
– గుమ్మల నాందేవ్, రైతు, కజ్జర్ల, తలమడుగు మండలం, ఆదిలాబాద్