ఎదులాపురం, మే 6 : ఆటోలను దొంగిలించి విక్రయిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ కార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాదించాలని ఏడుగురు ముఠాగా ఏర్పడ్డారు. ఇందులో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన(ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కేకాలనీలో ఉంటున్నాడు) యూసుఫ్(ఏ1), ఆదిలాబాద్ జిల్లా జైనూర్‌కు చెందిన సయ్యద్(ఏ2), పట్టణంలోని రణదివ్యనగర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షారుఖ్ పఠాన్(ఏ3), మేస్త్రీ అల్తాఫ్‌ఖాన్ (ఏ4), నార్నూర్ మండలంలోని నాగలకొండ గ్రామంలో వ్యవసాయం చేస్తున్న షేక్ ఖయ్యూం (ఏ5), ఆటో డ్రైవర్ అప్సర్బేగ్(ఏ6), మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాహోర్ తాలూకా గొండ్వవర్సా గ్రామానికి చెందిన మేస్త్రీ అసద్‌ఖాన్(ఏ7)లు కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
వీరందరూ ఆటోలు దొంగతనం చేయడం ప్రారంభించారు. అలా 27 ఆటోలను దొంగిలించి వాటి ప్లేట్ నంబర్లు, ఇంజిన్ నంబర్లను మార్చి విక్రయానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ వంతెన వద్ద మంగళవారం వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో షారూఖ్ పఠాన్ ఆదిలాబాద్‌లో దొంగిలించిన ఆటో(టీఎస్ 01 యూఏ 0832)తో అనుమానాస్పదంగా కనిపించాడు. అతనిని విచారించగా ఏడుగురు ముఠా సభ్యులు అందరూ కలిసి హైదరాబాద్, ఆదిలాబాద్‌లలో ఆటోలను దొంగిలించామని తెలిపాడు.
షారూఖ్ పఠాన్‌ను విచారించిన సందర్భంలో అల్తాఫ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్లగా అకడే షేక్ ఖయ్యూం ఉన్నాడు. వీరి వద్ద 15 ఆటోలు లభ్యమయ్యాయి. వీరూ అప్సర్ బేగ్, అసద్ ఖాన్ ఇంటి వద్దకు వెళ్లగా అక్కడ 11 ఆటోలు దొరికాయి. వీరిపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. యూసఫ్, సయ్యద్‌లు పరారీలో ఉన్నారు. 27 ఆటోల విలువ రూ.27లక్షల వరకు ఉంటుంది. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ కే ఫణిదర్, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై సయ్యద్ ముజాహిద్ పాల్గొన్నారు.