Asifabad | కౌటాల, మే 6: తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను మంగళవారం పట్టుకున్నట్లు కౌటాల సీఐ మొత్తం రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 5వ తేదీన చింతలమానపల్లి మండలం రన్నవెళ్లి ఎత్తిపోతల పథకంలో గల విద్యుత్ మోటార్ల నుండి రాగి తీగను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించుకు వెళ్లినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న సమయంలో మంగళవారం ఉదయం ఐదుగురు దొంగల ముఠా పట్టుబడిన తెలిపారు. సోమవారం ఎత్తిపోతల పథకంలోని రాగి తీగను దొంగిలించి తీసుకెళ్లగా తిరిగి మంగళవారం కూడా అందులోని రాగి తీగను దొంగిలించేందుకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠా వచ్చింది.
అప్పటికే అక్కడ కాపలాగా ఉన్న వాచ్మెన్ పోచయ్య అతనితో పాటు ఉన్న నలుగురు కలిసి ఈ ముఠాను పట్టుకోగా అందులో నుండి ముగ్గురు పారిపోయినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన ఇద్దరు డాన్సింగ్ గణేష్, సోలంకీలను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించగా పోలీసుల విచారణలో వారితోపాటు సతీష్ సీతారాం, రాజు సాహూ, లాజోల్ సాహూ అనే ముగ్గురు వ్యక్తులు రాగి తీగ దొంగతనానికి వచ్చినట్లు నేరం అంగీకరించినట్లు ఆయన తెలిపారు. వీరు గత నెలలో మూడుసార్లు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వద్దకు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు, అదే విధంగా గత సంవత్సరం సిర్పూర్ మండలం మండలం హుడికిలి ఎత్తిపోతల పథకంలో రాగి తీగను దొంగలించినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 95 కిలోల రాగి తీగ, 15 కిలోల ప్లేట్లు స్వాధీనపరుచుకున్నట్లు దాని విలువ 1,25,000 ఉంటుందని అదేవిధంగా వారి ఉపయోగించిన రెండు మోటార్ సైకిల్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సీఐ వెంట చింతల మానేపల్లి ఎస్సై నరేష్ పోలీసులు ఉన్నారు.