బేల : ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాటను తలపిస్తున్నది బేల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. అక్కడ వైద్యులు ఉంటే మందులు ఉండవు. మందులుంటే వైద్యులు ఉండరు. అన్ని టెస్టులు అందుబాటులో ఉండవు. సదుపాయాలూ అరకొరగానే ఉన్నాయి. దాంతో జనం టెస్టుల కోసం, మందుల కోసం ప్రైవేట్‌కు వెళ్లాల్సి వస్తోంది. బేల మండలవ్యాప్తంగా 52 గ్రామలకు ఇది ఒకటే ఆసుపత్రి ఉంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. ఇటీవల రాత్రి సమయంలో పురిటినప్పులతో వచ్చిన నిండు గర్భిణి పడ్డ అవస్థలను చూసి సర్కారు దవాఖానా అంటేనే అమ్మో అనే పరిస్థితి నెలకొంది. బేల మండల కేంద్రంలోని ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నది. 24 గంటలపాటు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఉన్న ఒకే ఒక డాక్టర్‌కు జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగించడంతో ప్రతిరోజు ఉదయం వచ్చి మధ్యాహ్నమే జిల్లా కేంద్రానికి వెళ్లిపోతున్నారు. దాంతో రోగులకు సరైన వైద్యం అందక ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. జిల్లా కేంద్రానికి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేల మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజూ 100కు పైగా పేషంట్లు వస్తుంటారు. అందులో 20 నుంచి 22 మందికి ఆసుపత్రిలోనే చికిత్సలు చేయాల్సి వస్తుంది.
కానీ ఇక్కడ సరైన సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి 24 గంటలు అందుబాటులో ఉండేలా డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని జనం వేడుకుంటున్నారు.
ఈ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గర్భిణీ స్త్రీలు, రోగులు వాపోతున్నారు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మహిళ తన పలుకుబడితో జిల్లా కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు. దాంతో ఇక్కడి రోగులకు రక్త పరీక్షలు చేయాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణ జ్వరం, సీజనల్ వ్యాధులతో వచ్చిన వారికి మాత్రం టెస్టులు బయట చేయించుకోవాలని చెబుతున్నారు. కొందరికి మాత్రం విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సులే రక్త పరీక్షల కోసం బ్లడ్ శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రానికి పంపించడంతో ఆ పరీక్షలు సంబంధించిన రిపోర్ట్ రావడానికి వారం రోజులు పడుతుందని అంటున్నారు. దాంతో గత్యంతరం లేక ప్రైవేటులో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇకనైనా ఇక్కడ విధులు నిర్వహించాల్సిన ల్యాబ్ టెక్నీషియన్ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
బేల ఆస్పత్రిలో సిబ్బంది కొరత వాస్తవమేనని, దాంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని బేల ప్రైమరీ హెల్త్ సెంటర్ (Primary Health centre) వైద్యులు డాక్టర్ వంశీకృష్ణ చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఉన్న సిబ్బందితోనే 24 గంటలపాటు సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.