మంచిర్యాల అర్బన్, జనవరి 28 : యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని, విద్యార్థి దశ నుంచే ప్రయోగాలపై దృష్టి పెట్టాలని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్ (డీఆర్డీవో) డా.సతీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్వారీ రోడ్డులో గల శ్రీ ఉషోదయ సీబీఎస్సీ పాఠశాల మైదానంలో కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్, యార్లగడ్డ అభిరామ్ మెమోరియల్ గ్రామ సేవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ ఇండియా-2025 వన్ డే స్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఇస్రో సైంటిస్ట్ శివశంకర్, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంస్థ నిర్వాహకుడు నరేశ్‌తో కలిసి సైన్స్ ఫెయిర్ (సాంకేతిక, రక్షణ విభాగానికి సంబంధించిన నమూనాల పరికరాలు)ను ప్రారంభించారు.
జ్యోతి ప్ర జ్వలన చేసి, అబ్దుల్‌కలాం విగ్రహానికి పూలమాల వేశారు. ఆయన మాట్లాడుతూ డీఆర్డీవో, ఇస్రోల సాయంతో కలాం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వంద రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డిఫెన్స్ ఏరో స్పేస్‌కు సంబంధించిన పరికరాలను ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాలలో మొదటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. వి ద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలోని పాఠశాలల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలీజెన్స్ పెట్టాలని, అది విద్యార్థులకు నేర్పించాలనే ఉద్దేశంతో 350 మిలియన్ డాలర్లు తీసుకువచ్చినట్లు తెలిపారు.
కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ దేశ రక్షణలో పాలు పంచుకునేందుకు మంచి అవకాశమన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భం గా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీ ఉషోదయ పాఠశాల నిర్వాహకులు యార్లగట్ట బాలాజీ, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, డీఎస్వో మధుబాబు, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, మున్సిపల్ తాజా మాజీ వైస్ ప్రెసిడెంట్ సల్ల మహేశ్, మాజీ కౌన్సిలర్లు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.