ఆదిలాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు దృష్టి సారించారు. వానకాలం ప్రారంభకావడంతో పలు రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహించడమే కాకుండా అవసరం లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించడం, మందులు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, మెడికల్ షాపులు పెట్టుకుని అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యశాఖ ప్రొగ్రాం అధికారులతో ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేపడుతున్నారు. వైద్య బృందాలు వారంలో రెండు, మూడు రోజులు తమ పరిధిలోని ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు.
గతేడాది జిల్లా వ్యాప్తంగా 60 ప్రైవేటు ఆసుపత్రులను అధికారులు తనిఖీలు చేశారు. పలు హాస్పిటళ్లలో లోపాలను గుర్తించిన వైద్యశాఖ అధికారులు సరిచేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఐదు రోజుల కిందట కలెక్టర్ రాజర్షి షా పట్టణంలోని భుక్తాపూర్‌లో నక్షత్ర ఆసుపత్రిని తనిఖీ చేశారు. హాస్పిటల్ నిర్వాహణతోపాటు అనుబంధ మెడికల్ షాపులో పలు లోపాలను గుర్తించారు. ఆసుపత్రి కార్డియాలజీ వైద్యుడు వివరాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నమోదు చేయకపోవడం, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం ప్రకారం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, వాహనాల పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి లోపాలు గుర్తించారు.
దీంతోపాటు మెడికల్ షాపులో షెడ్యూల్ ఎక్స్ అమ్మకాలకు లైసెన్స్‌లు తీసుకోకపోవడం, ఫార్మసిస్ట్ లేకపోవడం, హెచ్1 రిజిస్టర్ నిర్వహణ, మందు విక్రయాల రసీదులు లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. ఆసుపత్రి నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు రూ. 20 వేల జరిమాన విధించడంతోపాటు మెడికల్ షాపు లైసెన్స్‌ను రద్దు చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను వైద్య పేరిట అధిక డబ్బులు గుంజకుండా వైద్యశాఖ అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు రెగ్యూలర్‌గా నిర్వహిస్తాం. ప్రొగ్రాం అధికారులను తమ పరిధిలో వారానికి రెండు, మూడు తనిఖీలు చేయాలని సూచించాం. నిబంధనలు పాటించని ఆసుపత్రులు, ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్న వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విజిటింగ్ డాక్టర్లు తమ వివరాలను జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్