ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 7 : ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు మస్కాపూర్‌లో మంగళవారం అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిరుపేదలకు సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందన్నారు. కుమ్రం భీం చౌరస్తాలో నిర్మించిన 400 డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. కొద్ది రోజుల్లో పంపిణీకి ముహూర్తం ఖరారు చేస్తామన్నారు. అంబేద్కర్‌నగర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం మస్కాపూర్లోని కేజీబీవీ, జడ్పీ సెకండరీ పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం, మౌలిక వసతుల గురించి పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, కమిషనర్ రత్నాకర్ రావు, తహసీల్దార్ మోహన్ రాజ్, ఎంపీడీవో బాలె మల్లేశ్, ఎస్ఐ శంకర్, ఆర్అండ్బీ డీఈ మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కడెంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన..
కడెం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అధికారులతో కలిసి కలెక్టర్ వరుణ్ రెడ్డి పరిశీలించారు. తహసీల్దార్ గజానన్, ఎంపీడీవో లింబాద్రిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో అర్హులకు ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. ఇక్కడ నిర్మించిన 200 ఇండ్లకు సంబంధించిన జాబితాను పరిశీలించామని తెలిపారు. కడెం, కన్నాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గ్రామసభల ద్వారా జాబితా సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొనగా, అర్హులకు ఈ నెల చివరి వరకు పంపిణీ కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గదులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణాలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్, నాయ బ్ తహసీల్దార్ చిన్నయ్య, పంచాయతీరాజ్ ఏఈ లవకుమార్, ఏపీవో జయదేవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
దస్తురాబాద్ మండలంలో విస్తృత పర్యటన..
దస్తురాబాద్ మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా పెర్కపల్లెలో కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. అక్కడికి వచ్చిన వృద్ధులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం నర్సరీని, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, ఎరువుల తయారీ, ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. నర్సరీలో ఆదాయం వచ్చే మొక్కలను పెంచాలని కార్యదర్శికి సూచించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలతో ముచ్చటించారు. అందుతున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రంలోని కేజీబీవీకి వెళ్లారు. పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో పాఠాలు చదివించారు. వారి విషయ పరిజ్ఞానాన్ని చూశారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు.
పాఠశాలను చూసి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానోపాధ్యాయుడు కోట వేణు, ఉపాధ్యాయులను, పెర్కపల్లె సర్పంచ్ అప్పని ప్రభాకర్‌ను అభినందించారు. అనంతరం తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ, మిషన్ భగీరథ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ (ఈజీఎస్), ఐకేపీ శాశాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు స్వాగతం పలికి, పూల మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శారదాశ్రీనివాస్, ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు నిమ్మతోట రాజమణిశివయ్య, అప్పని ప్రభాకర్, ఉప సర్పంచ్ నరేశ్, వార్డు సభ్యులు, డీఈవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సిర్ప సంతోష్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ రాజు, ఎంఈవో మధుసూదన్, సీడీపీవో సరిత, వైద్యులు కామేశ్వర్, నాగరాజు, ఆర్ఐలు గంగన్న, పీవీ నర్సయ్య, హెచ్‌ఈవో వేణు గోపాల్, ఎస్వో వీణ, పంచాయతీ కార్యదర్శులు ఇందుమతి, సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ముడికె ఐలయ్య యాదవ్, నాయకులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటలపై సమీక్ష..
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 7 : కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో సంక్షేమ పథకాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉధ్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకం, ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను రైతులందరికీ చేరేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు సాగు విస్తీర్ణం అడిగిన ఆయన, పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతుబీమా, పంటల సాగు వివరాలు, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేవంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవనశాఖ అధికారి రాథోడ్ శ్యాంరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన జడ్పీ చైర్పర్సన్..
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వరుణ్‌రెడ్డిని జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి-రాంకిషన్‌రెడ్డి కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా పరిషత్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సాగౌడ్, సాగర్, సత్యనారాయణ, శ్రీనివాస్ ఉన్నారు.