కాగజ్‌నగర్, మార్చి 24 : అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామ పంచాయతీ పరిధిలో నష్టపోయిన పంటలను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రా వు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట నష్టంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమన్నారు.
స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఫొటోలు దిగి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు రైతుల పట్ల ప్రేమ ఉంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రిజిస్ట్రేషన్ చేయించి సాయమందించేలా కృషి చేయాలన్నారు. సొంత ప్రధానమంత్రితో మాట్లాడి రైతులను ఆదుకోవాలన్నారు. నాలుగు రోజులుగా రైతులు బాధపడుతుంటే అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు లేవనెత్తడం లేదన్నారు. బెంగాళీల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదన్నారు.
నాలుగు రోజులుగా అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా కావడం లేదని, సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని స్పష్టం చేశారు. అనంతరం ధ్వంసమైన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అధికారులు వెంటనే సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇండ్లు నిర్మించాలని, ఇందిరమ్మ ఇండ్లు పథకాలనికి అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టాన్ని లెక్కించి.. అవసరమైతే దీనిని విపత్తుగా ప్రకటించి ప్రత్యేక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు లెండుగురే శ్యాంరావు, రాజ్‌కుమార్, రాజు, అనూప్, నిత్యానంద్, గోకుల్, రింకు పాల్గొన్నారు.