ఆదిలాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ప్రభుత్వ నిబంధనల అమలుపై వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చే వారితో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా అవసరం లేకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించడం, మందులు ఇవ్వడం, ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ వెంటనే స్పందించి ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్య శాఖ ప్రోగ్రాం అధికారులతో ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేశారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్ రాజర్షి షా అధికారులతో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని గజానన్ హాస్పిటల్‌ను తనిఖీ చేసి పలు లోపాలు గుర్తించి, వారం రోజుల్లో సరిచేసుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.
జిల్లాలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు వైద్య శాఖ ప్రోగ్రాం అధికారులు తనిఖీల్లో గుర్తించారు. జ్వరాలు, డెంగ్యూ కేసులు వివరాలు నమోదు చేయకపోవడం, ఓపీ, ఐసీయూ, వ్యాధి నిర్ధారణ పరీక్షల ధరల వివరాలను వెల్లడించకపోవడం, మందుల నిల్వల్లో తేడాలు, అగ్నిప్రమాద రక్షణ చర్యలు పాటించకపోవడం, వ్యాధుల నిపుణులు లేకున్నా ఉన్నట్లు చూపిస్తూ చికిత్స చేయడం లాంటి వాటిని గుర్తించారు. ఫీజుల వివరాలను పట్టికలో తెలియజేయకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు అధికారులు ఇటీవల సమావేశం నిర్వహించి ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. గజానన్ దవాఖానలో క్యాథ్‌లాబ్‌లో వైద్యులు లేకున్నా ఉన్నట్లు బోర్డు ఉండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నాలుగు దవాఖానలను తనిఖీలు చేసి పలు లోపాలను గుర్తించామని నిర్వాహకులకు నోటీసులు ఇవ్వనున్నట్లు జిల్లా వైద్యాధికారి కృష్ణ తెలిపారు.