కొత్త జిల్లాల ఆవిర్భావంతో నవశకం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడం, సువిశాలంగా ఉండడం, అడవిబిడ్డలు అధికంగా ఉండడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ప్రజాహితమే ధ్యేయంగా.. ప్రగతి పథమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించడానికి నాలుగు జిల్లాలుగా విభజించారు. వికేంద్రీకరణతో జిల్లాలు చిన్నగా మారాయి. కలెక్టర్, ఎస్పీ, జిల్లాస్థాయి అధికారులు ప్రజల చెంతకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సులువుగా అందుతున్నాయి.
సుదీర్ఘంగా ప్రగతికి నోచుకోని పల్లెలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నో జాతీయ అవార్డులు అందుకుంటూ దేశంలోనే నంబర్ వన్ పల్లెలుగా నిలుస్తున్నాయి. ఇంకా.. దూరభారం, వ్యయప్రయాసలు తగ్గడం వంటివి ప్రగతికి శుభసూచకంగా చెప్పొచ్చు. గడిచిన కొన్నేళ్లలో కనీవినీ ఎరుగనిరీతిలో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏడేళ్ల ప్రస్తానంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు కొత్త జిల్లాలుగా ఏర్పడి నేటి(బుధవారం)తో ఏడేండ్లు అయ్యింది. సమైక్య పాలనలో ఆదిలాబాద్ జిల్లా అంటే ఏడుపొచ్చే పరిస్థితి. మారుమూల జిల్లా, వెనుకబడిన ప్రాంతం, అమాయకమైన జనంగా పేరుండే. ఏడేళ్ల క్రితం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులను కలవాలంటే 100 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అరకొర రవాణా సదుపాయంతో ఒక్క రోజులో ఆదిలాబాద్ పోయిరాలేక.. రెండు మూడు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. మంచిర్యాలను జిల్లా చేయాలనే ఆకాంక్ష నాలుగు దశాబ్దాలపాటు కలగానే మిగిలింది.
మరోవైపు ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా ఉన్న నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలు అవుతాయని కలలో కూడా అనుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి మంచిర్యాలను జిల్లా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నిర్మల్, ఆసిఫాబాద్‌లను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దీంతో జిల్లావాసులకు వ్యయప్రయాసలు తగ్గాయి. జిల్లాకు ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ అధికారులు వచ్చారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఎస్పీలు ఉన్నారు. రాష్ట్రస్థాయి అధికారులు కూడా జిల్లాలకు వచ్చినప్పుడు కలిసేందుకు వీలుగా కొత్త కలెక్టరేట్లలో స్టేట్ ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఏ జిల్లాకు ఆ జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, అప్గ్రేడేట్ ప్రభుత్వ ఆసుపత్రులు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. గడిచిన కొన్నేళ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏడేళ్ల ప్రస్తానంపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆవిర్భావంలోనే 12 మండలాలుగా ఉన్న ప్రాంతాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 15 మండలాలుగా ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా లింగాపూర్, చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాలు ఏర్పడ్డాయి. 173 జీపీలు ఉండగా.. అదనంగా 162 జీపీలను ఏర్పాటు చేశారు. 500 జనాభా ఉన్న గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ‘మా ఊర్లో-మా రాజ్యం’ అనే గిరిజనుల కల నెరవేరింది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని ఉన్నతీకరించడంతోపాటు మహిళల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డయాగ్నోస్టిక్ కేంద్రం, ఆక్సిజన్ ప్లాంట్, రక్తనిధి కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాతా, శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం కొత్తగా 12 రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు కొత్త కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మైనార్టీ, బీసీ వెల్ఫేర్ల ఏర్పాటుతో కార్పొరేట్ కళాశాలలో మాదిరి విద్యా విధానం అందుబాటులోకి వచ్చింది.
చెన్నూర్, అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజలకు పాలన చేరువ చేశారు. నిజంగా ఇది గొప్ప నిర్ణయం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఇక్కడి నుంచి 225కిలో మీటర్లు ఉంటది. ఏదైనా పని పడి వెళ్లాలంటే ఏడుపొచ్చేది. తీరా ఖర్చులు పెట్టుకొని పోతే పనులు కూడా అయ్యేవి కావు. అక్కడే ఉండి పని చేసుకున్నాక వచ్చిన రోజులున్నయి. ఇప్పుడు మంచిర్యాల జిల్లా కావడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుంట అయ్యాయి. ఇలా పోయి అలా వస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది.
– మహావాది సుధాకర్, రిటైర్డ్ ఉద్యోగి
కొత్తగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం నామకరణం చేయడం ఆదివాసులకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ 2016లో పరిపాలనా సౌలభ్యం కోసం ఆసిఫాబాద్‌ను జిల్లాగా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు అవస్థలు పడేవారు. జిల్లా కేంద్రం దూర ప్రాంతంలో ఉండడంతో పనులు మానేసి సమయం, డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం అందుబాటులోకి పరిపాలన రావడంతో ప్రజలకు సౌకర్యం కలిగింది. నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉండడంతో పల్లెలు ప్రగతిబాట పడుతూ, ప్రజలకు సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయి.
– ఆత్రం లక్ష్మణ్‌రావ్, ఆదివాసీ సీనియర్ నాయకుడు, మోడి (కెరమెరి).
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు దాదాపు 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. కుభీర్, బాసర, తానూర్, లోకేశ్వరం, కడెం, పెంబి మండలాలవాసులు ఆదిలాబాద్‌కు చేరుకోవాలంటే ఇబ్బందులు పడేవారు. సమస్యలు పేరుకుపోయి నెలల తరబడి పరిష్కారానికి నోచుకునేవి కావు. నిర్మల్ జిల్లాగా ఏర్పాటుతో దూరభారం 60 కిలోమీటర్ల లోపుకే పరిమితమైంది. ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్లో తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కే విన్నవించుకుంటున్నారు. కలెక్టర్‌కు సైతం ప్రజల ఫిర్యాదులను, విజ్ఞప్తులను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఏర్పడింది. చిన్న జిల్లా కావడంతో కలెక్టర్‌తోపాటు సంబంధిత శాఖలన్నీ ఆయా శాఖల పరిధిలో సమస్యలపై తక్షణమే స్పందించడం మొదలైంది.
దీంతో ఒకవైపు సమస్యలన్నీ పరిష్కారమవుతూనే, మరోవైపు జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధికి బాటలు పడ్డాయి. మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రంలో తరచూ సమీక్షలు జరిపి, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిర్మల్ పట్టణం జిల్లా కేంద్రంగా మారడంతో పట్టణ రూపురేఖలే మారిపోయాయి. పట్టణంలో ప్రధాన రోడ్ల విస్తరణతో పాటు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటుతో వాహనదారులకు ఎంతో సౌకర్యవంతంగా మారింది. అంతే కాకుండా బ్యూటిఫికేషన్ పేరిట ఫుట్‌పాత్‌ల నిర్మాణం, ఫ్రధాన కూడళ్లలో వాటర్ ఫౌంటేయిన్ ఏర్పాటులాంటివి జిల్లా కేంద్రానికి తలమానికంగా నిలుస్తున్నాయి. నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 10 :తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల చెంతకే కార్యాలయాలు వచ్చాయి. గతంలో ఉన్నతాధికారులను కలిసేందుకు వందల కిలో మీట ర్లు ప్రయాణించాల్సి వచ్చేది. అధికారులు అందుబాటులో లేకపో తే అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉండేది. రానూపోను ఖర్చులు తడిసి మోపెడయ్యేవి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రజలకు మేలు జరుగు తుంది. ఇబ్బందులు తొలగిపోయాయి. అన్ని శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సులువుగా అధికారులను కలిసే అవకాశం కలిగింది. విద్య, వైద్య పరంగా సౌకర్యాలు దగ్గరయ్యాయి. మహానగరాల్లో లభించే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
– పీజీ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 10 : తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇది గొప్ప విషయం. పారదర్శకమైన పాలన.. జవాబుదారి తనంతో కూడిన సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే వెసులు బాటు కలిగింది. కొత్త జిల్లాలకు వైద్య కళాశాలలు కేటాయించడంతో పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకునే అవకాశం కలిగింది. కంటి ముందు పాలన.. ఇంటి ముందు ప్రభుత్వం అన్న నినాదంతో పల్లె స్థాయి నుంచి పట్టణాల వరకు సగటు జీవన ప్రమాణాలు వృద్ధి చెందడం నిజంగా అభినందనీయం.
– ఉప్పుకృష్ణం రాజు, ప్రముఖ కవి, సామాజికవేత్త, నిర్మల్
మంచిర్యాల జిల్లాగా ఏర్పడ్డాక పాలన ప్రజలకు చేరువైంది. జిల్లాలో రూ.55.22 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ) అందుబాటులోకి వచ్చింది. ఒక కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇటీవల చెన్నూర్ రెవెన్యూ డివిజన్‌గా మారింది. మంచిర్యాల, లక్షెట్టిపేటతోపాటు నస్పూర్, క్యాతన్‌పల్లి, చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు వచ్చాయి. రూ.600 కోట్ల పైచిలుకు నిధులతో జిల్లాలో వైద్యరంగం బలోపేతమైంది. బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేటలకు కొత్త ఆసుపత్రులు వచ్చాయి. కొత్త పీహెచ్‌సీలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మంచిర్యాల జిల్లాలోనే వచ్చాయి.
వీటితో భూగర్భ జలాలు పెరిగాయి. లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హాజీపూర్ మండలంలోని పడ్తనపల్లిలో 10 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే మరో లిఫ్ట్ పనులకు ఇటీవలే మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. వీటికి తోడు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వార్ధా నది మీద నిర్మించే ప్రాజెక్టు నుంచి 55 వేల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రూ.333 కోట్లలో మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ రూ.500 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేశారు.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో అభివృద్ధి పనులతో పాలన జనాలకు చేరువైంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇవే కాకుండా మంచిర్యాల జిల్లాలో 12,68,280 మంది రైతులకు రైతుబంధు వస్తున్నది. 1,702 మంది రైతులకు రూ.85.10 కోట్ల రైతుబీమా వచ్చింది. దళితబంధుతో జిల్లాలో 313 మందికి కొత్త జీవితం దొరికింది. బీసీబంధు, మైనార్టీ బంధు కింద వందల మందికి మేలు జరిగింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో వేలాది మందికి లబ్ధి చేకూరింది. ఇదంతా మంచిర్యాల జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమైంది.