ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19 : ఇంద్రవెల్లి ఘటనకు నేటి(ఆదివారం)తో 44 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఏప్రిల్ 20, 1981 రోజును ఆదివాసీ గిరిజనులు ఎన్నటికీ మరువరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సభను అధికారికంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ద్వారా ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఉమ్మడి జిల్లా ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు తరలిరానున్నారు.
బుక్కెడు బువ్వ కోసం పడరాని పాట్లు పడుతున్న గిరిజనులు జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. పోలీసులు విచక్ష ణా రహితంగా కాల్పుల జరపడంతో అనేక మంది గిరిపుత్రులు అసువులు బాశారు. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ చెరిగిపోలేదు. 44 ఏళ్ల క్రితం గిరిజనులు, వ్యాపారులు అధికారుల చేతుల్లో అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు. గిరిజను లు నోరువిప్పితే చాలు అధికారులు చావబాదేవారు. ఈ క్రమంలో నక్సలైట్ల ఉద్యమం విస్తరిస్తుం ది. వారిని అణచి వేయడానికి గిరిజన గూడేల్లో పోలీసు ల బూట్ల చప్పుళ్లు ప్రారంభమయ్యాయి.
అష్టకష్టా లు పడుతున్న గిరిజనులు ఎవరు పోరాటం చేసినా కలిసిరావడానికి సన్నద్ధమయ్యారు. ఈ తరుణంలో నక్సలైట్లు భూ పంపిణీ చేయాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో గిరిజనులు అడవుల్లో ఖాళీగా ఉన్న భూములను దున్నడం ప్రా రంభించారు. అయిన అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో పలు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 1981, ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయిన వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని గిరిజన సంఘాలు ప్రకటించాయి.
ఏప్రిల్ 20, 1981న సోమవారం ఉదయం నలు దిక్కుల నుంచి గిరి జనులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రవెల్లి అం తా గిరిజనులతో నిండింది. సమావేశం జరగకుండా పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. వాహనాలు రాకుండా రహదారులను దిగ్బంధించారు. గిరిజనులను చూసిన పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సభాస్థలానికి గిరిజనులు ర్యాలీగా బయలుదేరారు. అప్పటి ప్రభుత్వం తాడోపేడో తేల్చుకోవాలని కసితో ఉంది. వేలాదిమందితో వస్తున్న గిరిజనుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ జవాన్ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి జవాన్పై చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేసింది. అంతే.. ఆ జవాన్ నేలకొరిగాడు. దీంతో పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తుపాకులకు పని చెప్పారు.
తుపాకుల శబ్దంతో ఇంద్రవెల్లి దద్దరిల్లింది. గిరిజనులపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు. దీంతో వందలాది మంది గిరిజనులు నేలకొరిగారు. చుట్టూ పక్కల పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై ఏరులై పారింది. ఎటు చూసినా ఎర్రని రక్తపు మడుగులు కనిపించాయి. వందలాది మంది గిరిజనులు అరుపులు, కేకలతో వాగుల వెంట పరుగులు తీశారు. కానీ.. సీమాంద్ర పాలకులు బాధితులకు ప్రభుత్వ పరంగా సంతృప్తికరమైన సాయం అందించలేదు. దీంతో వారు దుర్భార జీవితాలు గడుపుతున్నారు. కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ గ్రామం వద్ద అమరవీరులు స్తూపం ఏర్పాటు చేశారు. యేటా ఏప్రిల్ 20న అమరవీరులకు ఆదివాసీ గిరిజనులు వారి సంప్రదాయం ప్రకారం ఘనంగా నివాళులర్పిస్తూ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నారు.
అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ నిర్వహణ కోసం ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా అధికారికంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 150 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివాసీ గిరిజనులు స్వచ్ఛగా నివాళులర్పించుకోవచ్చన్నారు. అమరవీరుల స్తూపం వద్ద పోలీసుల ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
పిట్టబొంగురం గ్రామానికి చెందిన మడావి రాము, వడగాంకు చెందిన కనక సోము, కోయల్పాండ్రికు చెందిన తోడసం భీంరావ్, గౌరాపూర్కు చెందిన హెరేకుమ్రం జగ్గు, బోథ్ మండలంలోని సాంగ్వి(కౌట)కు చెందిన మండాడి జంగు, ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్గాంకు చెందిన కోవా రాము, గౌరాపూర్కు చెందిన సిడాం బాపురావ్, తాటిగూడకు చెందిన సెడ్మకి కోద్దు, (మోహన్గూడ) తేజాపూర్కు చెందిన ఆర్కా గంగు, గౌరాపూర్కు చెందిన మంగం ముత్తు, పిట్టబొంగురంకు చెందిన కోట్నాక్ గంగు, సిరికొండ మండలంలోని నిజామ్గూడకు చెందిన పెందూర్ భీంరావ్, పాండుగూడకు చెందిన పెందూర్ మచ్చు, పాండుగూడకు చెందిన పెందూర్ గంగారాం, సోన్పల్లికు చెందిన పెందూర్ సుంగులు పోలీసుల కాల్పులో మృతి చెందినారు.