సొంతింటి కల నెరవేరుతుందనుకొని సంబురపడ్డ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతున్నది. యాప్‌లో ఆధార్ నంబర్లు, పేర్లు, ఇంటిపేర్లు తప్పుగా నమోదు చేశారన్న కారణాలతో బిల్లులు మంజూరు చేయకపోగా, వారంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్వాల్సి వస్తున్నది. బంగారం అమ్ముకొని.. అప్పులు తెచ్చి మరీ ఇంటి నిర్మాణానికి పెట్టగా పట్టించుకున్న నాథుడు లేకపోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ విషయమై గట్టిగా మాట్లాడితే అధికార పార్టీ లీడర్లు ఏమంటారోనని భయపడి వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఉన్నాయంటూ యంత్రాంగం చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– మంచిర్యాల, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆధార్ తప్పుల సవరణలో జాప్యం
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ వెబ్సైట్ సాప్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దీంతో పంచాయతీ సెక్రటరీలు, ఏఈలు యాప్‌లో వివరాలు నమోదు చేసినప్పుడు.. సాప్ట్వేర్ అప్డేట్ చేయడానికి ముందు గతంలో నమోదు చేసిన వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఇప్పుడు అది తీసుకోవడం లేదు. ఉదాహరణకు ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసినప్పుడు పంచాయతీ సెక్రటరీ వచ్చి ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారు. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయ్యాక వచ్చి.. మరోసారి ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారు.
ఇదయ్యాక బేస్మెంట్ లెవల్లో హౌసింగ్ ఏఈ వచ్చి ఫొటో అప్లోడ్ చేయాలి. ఈ సమయంలో ఒకరు ఎంటర్ చేసిన వివరాలు.. తర్వాత ఎంటర్ చేసే వివరాలు మ్యాచ్ కాక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డు నంబర్లలో తప్పులు, లబ్ధిదారుల పేర్లలో తప్పులుంటే యాప్ తీసుకోవడం లేదు. ఆధార్ తప్పులుంటే రిజెక్ట్ అని వస్తుంది. మండలాల్లోని ఎంపీడీవోల లాగిన్‌లో లబ్ధిదారుల పేర్ల వరకు కరెక్షన్ అవుతున్నాయి. కానీ లబ్ధిదారుగా భార్య ఉండి, భర్త ఆధార్ నంబర్ ఉంటే అది కరెక్షన్ చేసే అధికారం కేవలం కలెక్టర్లకే ఇచ్చారు. అక్కడ అవి కరెక్షన్ చేస్తున్నారు. ఇలా ఎంపీడీవో, కలెక్టర్ లాగిన్‌లో చేసిన తప్పుల సవరణ అప్డేట్ అవ్వడానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు కలెక్టర్, ఎంపీడీవోల లాగిన్లలోనూ అవ్వడం లేదు.
ఇలాంటివి హైదరాబాద్ హౌసింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీమ్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో జాప్యం జరుగుతుంది. నెలలకొద్దీ పెండింగ్ ఉండిపోతుంది. దీంతో క్షేత్రస్థాయిలో పనులు చేసినా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కావడం లేదు. బేస్మెంట్ లెవల్లో బిల్లులు మంజూరయ్యాక.. గోడలు కట్టిన సమయంలో సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రెండో బిల్లు రావడం లేదు. ఇలా కొందరు లబ్ధిదారులకు ఒకటీ రెండు బిల్లులు రాగా, కొందరికి ఒక్క బిల్లు కూడా రాలేదు. ఈ సమస్యల పరిష్కారం తమ స్థాయిలో లేదని జిల్లా అధికారులు అంటున్నారు. మా లాగిన్‌లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు క్లీయర్ చేస్తున్నామని, హైదరాబాద్‌లోనే కావడం లేదని చెప్పుకొస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంటే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఫొటో క్యాప్చరింగ్‌లో తీవ్రమైన అలసత్వం..
ఆధార్ మిస్ మ్యాచ్ సమస్యలకు తోడు ఫొటో క్యాప్చరింగ్ సైతం ఆలస్యమవుతుంది. ఇంటి నిర్మాణం మొదలు పెట్టాక బేస్మెంట్ వరకు పని పూర్తయితే ఆ ఫొటోలు తీసి యాప్‌లో నమోదు చేయాలి. అప్పుడు రూ.లక్ష బిల్లు వస్తుంది. రెండో దఫాలో గోడలు కట్టుకొని ఫొటో అప్లోడ్ చేస్తే మరో రూ.లక్ష బిల్లు వస్తది. మూడో దఫాలో స్లాబ్ నిర్మించి ఫొటో అప్లోడ్ చేస్తే మరో రూ.రెండు లక్షలు, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాక ఫొటో అప్లోడ్ చేస్తే మరో రూ.లక్ష వస్తాయి. కానీ ఫొటోలు క్యాప్చర్ చేసి, ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో అధికారులు తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిర్మాణం పూర్తిచేశామని లబ్ధిదారులు సమాచారం ఇచ్చినా నెలల తరబడి అధికారులు ఫొటో క్యాప్చర్ చేయడానికి రావడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎక్కడికక్కడ వివిధ దశల్లో నిలిచిపోతున్నది.
ఇది చూసి ఇండ్లు మంజూరైన చాలా మంది మా కొద్దు.. ఈ ఇందిరమ్మ ఇండ్లు అంటూ సర్కారుకు అప్లికేషన్లు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20శాతం నుంచి 30శాతం మంది ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్న జాప్యాన్ని చూసి మాకు ఇందిరమ్మ ఇండ్లు వద్దని దరఖాస్తులు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలు వెల్లడించేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. అందుకే తొలి, రెండో విడుతలో ఎంపికైన లబ్ధిదారుల సంఖ్యకు మొదలైన ఇండ్ల నిర్మాణ పనులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఓ వైపు ఆధార్ మిస్ మ్యాచ్ సమస్యలు, మరోవైపు అధికారుల అలసత్వంతో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అభాసుపాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. టెక్నికల్ సమస్యలు, బిల్లుల జాప్యంపై మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా.. మా పరిధిలో చేయాల్సింది చేస్తున్నాం. హైదరాబాద్ స్థాయిలోనే సమస్యలున్నాయి. నేను చెప్పినట్లు మాత్రం రాయద్దంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని సమస్యలు పరిష్కరిస్తుందా.. లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
బిల్లు వస్తదో.. రాదో అంటున్నరు
మాది మంచిర్యాల జిల్లా భీమిని మండలం మళ్లిడి గ్రామ పంచాయతీలోని దుబ్బగూడెం. మాకు మొదటి బిల్లు, రెండో బిల్లు వచ్చింది. మూడోది స్లాబ్ వేసుకున్నాక ఫొటో క్యాప్చర్ కాలేదు. స్లాబ్ వేసి మూడు నెలలవుతుంది. ఎందుకు ఫొటో తీయడం లేదని పదిహేను, ఇరవై రోజుల కింద కలెక్టర్ సార్ దగ్గరికి పోయి అడిగిన. నా పేరుపై ఇల్లు మంజూరైతే, యాప్‌లో మా భర్త ఆధార్ కార్డు నంబర్ కొట్టారంట. ఆ తప్పుతో నీకు డబ్బులు వస్తలేవు. బిల్లులు క్యాప్చర్ అయితలేవు అని చెప్పినుర. అప్పుడు హౌసింగ్ పీడీ సారు పది రోజుల్లో బిల్లు పడుతదన్నరు. పడకపోయే సరికి సోమవారం మళ్లోసారి కలెక్టర్‌ను కలిసిన.
ఇంకా ఫొటోలు తీసుకెళ్లలేదని చెప్పిన.. దానికి ఆయన నువ్వు ఒక 50 మందిని తీసుకొని హైదరాబాద్‌కు పో.. ఫ్రీ బస్సే కదా.. మాతోని కావడం లేదు అన్నరు. అక్కడే ఉన్న హౌసింగ్ పీడీ మాట్లాడి వివరాలు అడిగారు. తప్పు ఎంటర్ చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావని అడిగారు. దానికి నాకు సంబంధం లేదని చెప్పిన. కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ రోజు మంగళవారం వచ్చి ఫొటో తీసుకున్నరు. బేస్మెంట్ వేసి, గోడలు కట్టాక స్లాబ్ ఫొటో తీయలేదు. పంచాయతీ సెక్రటరీని అడిగితే వచ్చి తీసుకుపోతరు మీరు ప్లాస్టరింగ్ చేసుకోమన్నడు. ఇవాళ ఫొటో తీసేందుకు వచ్చిన అధికారి ఏమో మీరు ప్లాస్టింగ్ ఎందుకు చేసిండ్రు.. బిల్లు వస్తదో రాదో అంటున్నడు. తీరొక్క మాట మాట్లాడితే ఎట్లా. ఫొటోనైతే తీసుకెళ్లారు. ఇప్పటికైనా బిల్లు వస్తదో రాదో చూడాలి.
– మలిశెట్టి గౌతమి, మళ్లిడి గ్రామం(దుబ్బగూడెం) (భీమిని మండలం)
బంగారం అమ్మిన.. అప్పు చేసిన..
మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గిరవెల్లి గ్రామం. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇల్లు కట్టడం మొదలు పెడితేనే బిల్లులు వస్తాయని సార్లు చెప్పిన్రు. నా దగ్గర డబ్బులు లేకుండే. వచ్చిన అవకాశం వదులుకోవడం ఇష్టంలేక బంగారాన్ని అమ్మిన. రూ.50 వేలు వచ్చినయి. ఆ డబ్బుతో సలాక, సిమెంట్ కొన్న. పిల్లర్ల కోసం రంధ్రాలు తవ్వించిన. అప్పటికే పైసలన్నీ అయిపోయినయ్. బేస్మెంట్ దాకా కడితేనే బిల్లు వస్తద న్నరు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో రూ.1.30 లక్షలు అప్పు తెచ్చి బేస్మెంట్ కట్టుకున్నా. ఇప్పటి దాకా బిల్లులు రాలే. ఆఫీసర్లు వచ్చి ఫొటోలు తీసుకుంటేనే బిల్లులస్త యంటున్నరు. వాళ్లు ఎప్పుడు వస్తరో.. బిల్లు ఎప్పుడు ఇస్తరో తెలియదు. ఆ వచ్చే బిల్లుతోని అప్పు తీరుతదో లేదో. బేస్మెంట్ దాకా ఇల్లు పూర్తయ్యిందని అధికారులకు సమాచారం ఇచ్చి 15 రోజులైతంది. ఇప్పటి దాకా రాకపాయే.
– నిట్టూరి కళ్యాణి, గిరవెల్లి గ్రామం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఫస్ట్ కొబ్బరి కాయ కొట్టింది మా ఇంటికే..
మళ్లిడి గ్రామంలో ఫస్ట్ మా ఇంటికే భూమి పూజ చేసిండ్రు. ముగ్గుపోసి 40 కొబ్బరికాయలు కొట్టిండ్రు. బేస్మెంట్ వరకు కట్టాక వచ్చి ఫొటో తీసుకున్నరు. బిల్లులు వెనుకాముందు పడుతయ్.. ముందైతే గోడలు పెట్టమంటే పెట్టినం. ఫొటోలు తీసుకెళ్లి నాలుగు నెలలైతంది. బిల్లు రాలేదు. ఏదో అప్రూవల్ రాలేదంటున్నారు. హైదరాబాద్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఇంకా కొట్టలేదంటున్నరు. గోడలు లేపిన ఇంటికి బిల్లులు రాక మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా వెంటనే బిల్లు మంజూరు చేయాలి.
– వగ్గు వనిత, మళ్లిడి గ్రామం(దుబ్బగూడెం), భీమిని మండలం, మంచిర్యాల జిల్లా