నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor) , గాదిగూడ మండలాల (Gadiguda Mandal) లో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం( Rain ) కురిసింది. నార్నూర్ మండల కేంద్రంలో వార సంత కావడంతో వారం రోజులకు సరిపడా సరుకులు, కూరగాయలు కొనుగోలుకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సంతలో కనీస సౌకర్యాలు లేకచిరు వ్యాపారస్తులు అవస్థలు పడ్డారు.
ప్రతి ఏడాది లక్షల రూపాయలతో వేలంపాట అధికారులు నిర్వహిస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం. వర్షాకాలంలో తడుస్తూ వ్యాపారం చేయవలసిన దుస్థితి నెలకొందని చిరు వ్యాపారులు వాపోయారు. కనీసం కాల కృత్యాలకు నిమిత్తం మరుగుదొడ్డి కూడా నిర్మించలేని దుస్థితి ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా పంచాయతీ శాఖ అధికారులు స్పందించి వారసంతలో కనీస వసతులు కల్పించాలని కోరారు.