నమస్తే నెట్వర్క్, జూలై 21 : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను వాన వదలడం లేదు. మూడు రోజులుగా గెరువివ్వకుండా పడుతుండగా, ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటెత్తుతున్నది. ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండగా, గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా, వాగు లు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, అక్కడక్కడా ఇండ్లు కూలిపోయాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం 63.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అడ గ్రామంలోని కుమ్రం భీం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 3258 కుసెకుల నీరు వచ్చి చేరుతున్నది. 4,5,6వ గేట్లు ఎత్తి 3258 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పంచాయతీ పరిధిలోని బారెగూడలో రోడ్డు బురదమయం కాగా, గ్రామస్తులు వరి నాటు వేసి నిరసన తెలిపారు.
చింతలమానేపల్లి మండలం బాబాసాగర్లోని అర్కగూడ ప్రాజెక్టు నిండడంతో మత్తడి దుంకుతున్నది. నాయికపుగూడకు రాకపోకలు నిలిచిపోయాయి. దిందా-కేతిని వాగు ఉప్పొంగడంతో దిందా ప్రజలు మూడు రోజులగా జలదిగ్బంధంలో ఉన్నారు. పెంచికల్పేట్ మండలంలోని పెద్దవాగు, ఉచ్చమల్లి వాగు, బొకి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి.పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని గుండెపల్లి బీట్ అటవీప్రాంతంలోగల దుద్దులాయి జలపాతం ఆకట్టుకుంటున్నది.
కొండపల్లి గ్రామంలో గొల్లవాగుపై శిథిలావస్థలో ఉన్న లోలేవల్ వంతెనలో ప్రమాదవశాత్తు పడి కోడె మృతి చెందింది. జైనూర్ మండలం లొద్దిగూడ వాగును దాటి వైద్య సిబ్బంది గర్భిణులకు వైద్యం అందించారు. కౌటాల మండల సరిహద్దుగా ఉన్న వార్దా, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుమ్డిహట్టి వద్ద ప్రాణహిత నది ఒడ్డున పుష్కర ఘాట్ మెట్లు మొత్తం మునిగిపోయాయి.
తాటిపల్లి వద్ద పంట చేలల్లోకి వరద చేరింది. సిర్పూర్(టీ) నుంచి చీలపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిలో కల్వర్టు, చిన్న మాలిని వద్ద లోలెవల్ వంతెనలు వరద ధాటికి కోట్టుకుపోయాయి. సిర్పూర్(టీ)-వెంకట్రావ్‌పేట్ అంతర్రాష్ట్ర వంతెన వద్ద పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
మంచిర్యాల జిల్లా..
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండగా, సింగరేణిలోని 20 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోయింది. ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన మట్టి తవ్వకాలు, రవాణా పూర్తిగా నిలిచిపోయింది. శ్రీరాంపూర్ ఏరియాలో 5 రోజుల్లో రూ. 4.5 కోట్ల నష్టం వాటిల్లింది. కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. నక్కలపల్లి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న లోలెవల్ వంతెన కొట్టుకుపోగా, గ్రామానికి చెందిన యువకులు శ్రమదానం చేసి రాకపోకలు పునరుద్ధరించారు.
భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా సమీపంలో ఉన్న వాగులు, చెరువులు, ఒర్రెల్లోకి చేపలు రావడంతో యువకులు పట్టుకున్నారు. వేమనపల్లి మండలం ముల్కలపేట నుంచి రాచర్ల వెళ్లే మార్గంలో కొత్తగా నిర్మించిన హై లెవెల్ వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు దెబ్బతిన్నది.
పోలీసులు ఈ మార్గాన్ని మూసివేయడంతో రాచర్ల, వెంచపల్లి, సూపాక, జనగామ , ఆలుగామ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. తాండూరు, మందమర్రి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండగా, ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కడెం ప్రాజెక్టు నీటి విడుదల

కడెం, జూలై 21 : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కడెం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 690. 875 అడుగులు (5.444టీఎంసీల) వద్ద ఉంది. 13,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 14,359 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. దీంతోపాటు, కుడి కాలువకు 8 క్యూసెక్కులు, ప్రధాన కాలువకు 298 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో 698 అడుగుల నీటిమట్టం వద్ద నిల్వ ఉంచుతూ అ ధికారులు ఎగువ నుంచి వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు విడుదల చేసేవారు.
అయితే పనులు పూర్తి అయినప్పటికీ 690 అడుగుల వద్ద నీటిని ఉంచి, వచ్చిన స్వల్ప ఇన్‌ఫ్లోను దిగువకు విడుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయకట్టు వద్ద సీ ఈ, డీఈసీ, ఈఈ, డీఈ, ఏఈలు అందుబాటులో నే ఉంటున్న క్రమంలో కేవలం 15 వేల ఇన్‌ఫ్లో రావడంతోనే నీటిని నాలుగు గేట్ల ద్వారా విడుదల చేయడం అధికారుల నిర్లక్ష్యంగా కనబడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులో కనీసం 696 అడుగుల వద్ద నీటిని నిల్వ ఉంచుతూ వచ్చే ఇన్‌ఫ్లో అదే స్థాయిలోవిడుదల చేస్తే సరిపోతుందని, 18 గేట్లు మరమ్మతులు పూర్తి చేసి ఉంచిన పరిస్థితిలో కేవలం 690వరకు మాత్రమే నీటిని నిల్వ ఉంచడం ఎంటని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాలు సంవృద్ధిగా ఉన్నప్పటికీ భవిష్యతులో ఇ బ్బందులు తతెత్తితే పరిస్థితి ఎంటని, కావున అధికారులు 696అడుగుల వద్ద నైన నీటిని నిల్వ ఉంచేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం 13283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు అంతకు మించి 14359 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.