మంచిర్యాల, జూలై 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ‘సొమ్మొకరిది.. సోకొకరిది..’ అన్న చందంగా ఉంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిధులు మంజూరై పూర్తయిన పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తుండడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటినా ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ హైదరాబాద్‌కు పరిమితమవుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఏ మాత్రం నిధులు కేటాయించేలా కృషి చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితో మంజూరైన పనులు నేడు పూర్తికాగా ఆ పనుల ప్రారంభోత్సవాలను తండ్రీకొడుకులైన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణలు వస్తుండడం చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయికి కూడా తీసుకురాకుండా బాల్క సుమన్ కృషితో మంజూరైన అభివృద్ధి పనులను మేమే చేశామని చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలో 22 బ్రిడ్జిలు మంజూరు చేసి నియోజకవర్గ ప్రజలకు రవాణా కష్టాలు లేకుండా చేశాడు. చెన్నూర్ నియోజవర్గ ప్రజలు చెన్నూర్-బీమారం మద్యగల జోడువాగుల రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతుంటే కంకర పోసి చేతులు దులుపుకొని బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు మరమ్మతులపై దృష్టి ఎందుకు సారించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అన్ని మేమే చేసుకుంటున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలుగా చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చిన నిధులెన్ని, ప్రారంభించిన పనులెన్ని అని ప్రశ్నిస్తున్నారు. గతంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితో మందమర్రి రామన్ కాలనీలో ఆర్వోబీ నిర్మాణానికి రూ.27.05 కోట్లు మంజూరు చేయించి పనులను పూర్తి చేయించాడు.
ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ అప్పటి ఆర్అండ్బీ సీఈ సతీశ్‌తో మాట్లాడి ఆర్వోబీ అలైన్మెంట్ మార్చడం వల్ల సుమారుగా 90 ఇండ్లు నేలమట్టం కాకుండా కాపాడగలిగారు. చెన్నూర్ ప్రజల అవసరాల కోసం చెన్నూర్ పట్టణంలో 2023 జూన్ 5న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు రూ.1.90 కోట్లు మంజూరు చేయగా.. ఆ పనులు పూర్తి కావడంతో చెన్నూర్‌లో విద్యుత్ సమస్యకు దాదాపుగా పులిస్టాప్ పడింది.
బాల్క సుమన్ ముందుచూపుతో చెన్నూర్‌లో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండాలని సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులను త్వరితగతిన పూర్తి చేయించాడు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు పాలన పరంగా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో 37 గ్రామ పంచాయతీలకు భవన నిర్మాణాలు మంజూరు చేయించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పుల నిధులు కూడా మంజూరు చేయించగా, ఆ నిధులతో పూర్తయిన కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని తండ్రీకొడుకులు ప్రారంభించారు.