బోథ్, జూన్ 23 : తొలకరి చినుకుల పలకరింపుతో విత్తనాల సందడి మొదలైంది. శుక్రవారం తెల్లవారు జామున కురిసిన ఓ మోస్తరు వర్షంతో అన్నదాతలు విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. ఎద్దులతో పత్తి కూరెల సాయంతో సాళ్లు కొట్టారు. మహిళలు పత్తి విత్తనాలు వేశారు. మృగశిర కార్తె ప్రవేశించి 15 రోజులు గడిచినా వాన జాడలేక పోవడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. సకాలంలో విత్తనాలు వేయకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. ఎట్టకేలకు వరుణ దేవుడు కాస్త కరుణించడంతో విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. బోథ్, కన్గుట్ట, పొచ్చెర, తేజాపూర్, కుమారి, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), కుచ్లాపూర్ తదితర గ్రామాల్లో రైతులు పత్తి విత్తనాలు వేయడంతో సందడి కనిపించింది.

భీంపూర్ మండలంలో..
భీంపూర్, జూన్ 23 : భీంపూర్ మండలం నిపాని, పిప్పల్కోటి, వడూర్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కరంజి(టీ), అర్లి(టీ) శివార్లలో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. కాగా, ఇప్పటికే చేలలో కొంతమంది రైతులు వివిధ పంటల విత్తనాలు వేశారు. చిరుజల్లులు కురియడంతో మరికొంతమంది రైతులు చేలల్లో పత్తి, సోయా, కంది తదితర విత్తనాలు వేస్తున్నారు.
తాంసి మండలంలో..
తాంసి, జూన్ 23 : మండలంలోని గిరిగామ, తాంసి, వడ్డాడి, పొన్నారి, జామిడి, బండల్ నాగాపూర్, కప్పర్ల, ఈదుల్లా సవర్గాం, హస్నాపూర్, పాలోడి, గోట్కూరి, అంబుగాం గ్రామాల్లో వర్షం కురిసింది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో ఆయా గ్రామాల్లో పత్తి విత్తనాలు విత్తేందుకు రైతులు సంసిద్ధం అవుతున్నారు. కొందరు రైతులు తమ భూముల్లో ఆయా పంటల విత్తనాలు వేయడం ప్రారంభించారు.