నర్సాపూర్(జి), మే 22 : నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్లో కరెంటు లేకపోవడంలో ఆశ వర్కర్లు టీకాలను చెట్ల కిందనే వేస్తున్నారు. ఇక్కడ ప్రతి బుధ, శనివారాల్లో చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఈ హెల్త్ సబ్ సెంటర్ను శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లో కొనసాగిస్తున్నారు. ఇందులో కనీసం మీటరు కూడా లేదు.
ఎండాకాలం కావడంతో ఉక్కపోతతో సిబ్బందితోపాటు పిల్లలు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. వచ్చేది వర్షాకాలం కావడంతో శిథిలావస్థలో ఉన్న భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ హెల్త్ సబ్ సెంటర్ను ఇక్కడి నుంచి వేరే చోటికి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.