సోన్, సెప్టెంబర్ 28: తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సొంత గూడు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షని, వచ్చే నాలుగైదు ఏండ్లల్లో ఇండ్లు లేని వారు ఉండరని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం సోన్ మండలం గంజాల్ గ్రామంలో 42 మందికి ప్రభుత్వం అందజేసిన డబుల్ బెడ్రూం ఇండ్లను కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతనే డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తోందని, నిరుపేదలకు సొంత గూడు ఉండాలనే కలను నిజం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఇప్పటికే నిర్మల్ పట్టణంలో 2వేల మందికి ఇండ్లు కట్టి ఇచ్చామని తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3లక్షలను అందిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఖరీఫ్‌లో అనుకున్న సమయానికి వర్షాలు కురవకపోవడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీరు తక్కువస్థాయిలో ఉండగా,
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి మళ్లించామని చెప్పారు. దీంతో సాగు, తాగు నీటికి ఎప్పుడూ కూడా ఢోకా ఉండదని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రావాళ్ల పెత్తనం ఉండడంతో మన ప్రాంతం వెనుకబడి ఉండేదన్నారు. 175 మంది ఎమ్మెల్యేలు వాళ్లుం టే, 119 ఎమ్మెల్యేలు మన వాళ్లు ఉండడంతో నిధులు ఎక్కువ మొత్తంలో వాళ్లే తీసుకుపోయేవారని వాపోయారు. కేసీఆర్ సంకల్పంతో ప్రత్యే క తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలు, నిధులు, నీళ్లు మనకే కేటాయించుకోవడంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ ఈరోజు లబ్ధిదారులు గృహాప్రవేశం చేయడం చాలా ఆనందంగా ఉందని, పేదల కల సాకరమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, సర్పంచ్ లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణాప్రసాద్రెడ్డి, సోన్ బీఆర్ఎస్ మండల కన్వీనర్ మొహినొద్దీన్, ఎంపీటీసీ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శివరాజ్, రైతుబంధు మండల కన్వీనర్ మహేందర్‌రెడ్డి, నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఎల్చల్ గంగారెడ్డి, పాకాల రాంచందర్, దాసరి శ్రీనివాస్, ప్రసాద్, మ్యాక ప్రేమ్‌కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, సెప్టెంబర్,28: చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని మున్సిపల్ కార్యాలయం పక్కన కోటి 35 లక్షల నిధులతో మంజూరైన బాల సదన్ భవనం నిర్మాణానికి కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న బాలసదనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతనంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భవనం నిర్మాణం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీడీపీవో భవనం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, సీడీపీవో నాగమణి, నాయకులు పాల్గొన్నారు.