మంచిర్యాల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల మున్సిపాలిటీల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో ఏ గల్లీకి వెళ్లినా సెట్ బ్యాక్ తీసుకోకుండా కట్టే భవంతులు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారులను అడిగితే ‘పొలిటికల్ ఒత్తిడి అండీ.. దయచేసి ఈ విషయాన్ని పబ్లిష్ చేయకండీ’ అంటూ చెప్పుకొస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో సర్వే 199లో ఓ వ్యక్తి మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకోకుండానే షెడ్లు నిర్మిస్తున్నాడు.
నిత్యం రద్దీగా ఉండే బైపాస్ రోడ్డులో గుట్టుచప్పుడు కాకుండా పెద్ద పెద్ద రేకులు అడ్డంగా పెట్టి లోపల నిర్మాణాలు చేస్తున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అధికారులు అనుమతులు తీసుకోవాలని నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిసింది. అలాంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోవడానికి వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా.. లేదా.. అనేది వేచి చూడాల్సి ఉంది.