నెన్నెల,మార్చి 18 : నెన్నెల మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుండగా, అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కొందరు అభివృద్ధి పనుల పేరిట మైలారం, ఖర్జీ, నెన్నెల గుండ్ల సోమారం వాగుల నుంచి రాత్రీ.. పగలూ అనే తేడా లేకుండా ట్రాక్టర్లలో రవాణా చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. మైలారం వాగు నుంచి నేరుగా ఆవుడం, చిత్తాపూర్, గంగారం గ్రామాలతో పాటు మందమర్రి మండలంలోని చుట్టు పక్కల గ్రామాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఇక గుండ్ల సోమవారం, ఖర్జీ నుంచి నేరుగా బెల్లంపల్లికి తీసుకుపోతున్నారు.
అక్రమ దందాపై మైనింగ్ అధికారులకు సమాచారమిస్తే.. వారే ట్రాక్టర్ల యజమానులకు ఫోన్ చేసి తప్పించుకోండని చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంప్‌లు ఏర్పాటు చేస్తున్నా.. అటు మైనింగ్.. ఇటు రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, రైతులు మండిపడుతున్నారు. మైనింగ్ అధికారులు ట్రాక్టర్లను పట్టుకోవడానికి వస్తున్నట్లు తెలిసి.. ఎఫ్ఆర్వోలు ముందస్తుగా యజమానులకు సమాచారమందిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
బోర్లు అడుగంటుతున్నాయి
వాగుల నుంచి ఇసుక తరలించుకుపోవడం వల్ల బోర్లలోని నీరు అడుగంటి పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎండాకాలమని.. ఇషారాజ్యంగా ఇసుక తోడడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పంటలు చేతికందకుండా పోయే అవకాశముందని వారు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు వేడుకుంటున్నారు.