బెల్లంపల్లి, ఆగస్టు 3: బెల్లంపల్లి పట్టణ శివారు, మండల పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి అనుమతి లేకుండా మొరాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న మెయిన్ రోడ్డు పక్కన బూధాకలాన్ రాతి చెరువు సమీపంలో ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా తవ్వి తీసిన మొరాన్ని ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి శివారులోని పట్టణంలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్ద అక్రమంగా తవ్వకాలు జరిపి మొరాన్ని తరలిస్తున్నారు. బూధాఖుర్ధు, బట్వాన్పల్లి, పెరకపల్లి గ్రామాల శివారుల్లో సైతం అనుమతి లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయి.
బెల్లంపల్లి మండలంలో పలు గ్రామపంచాయతీల పరిధిలో కూడా మొరం దందా సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ తతంగమంతా పగలు, రాత్రి అని తేడా లేకుండా జరుగుతున్నదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు అందుబాటులో లేని శని, ఆదివారాలతో పాటు, ప్రభుత్వ సెలవు దినాల్లో మరింత జోరుగా సాగుతున్నదని విమర్శలు వస్తున్నాయి. ట్రాక్టర్ మొరాన్ని మట్టిని రూ.800 నుంచి 1000 విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందినప్పుడు నామమాత్రపు తనిఖీ చేస్తున్నారని, పట్టుబడ్డ ట్రాక్టర్లను రాజకీయ ఒత్తిడి కారణంగా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ అడ్డూ అదుపు లేకుండా దందా సాగిస్తున్నారు.
ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నదని, భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయని, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని తనిఖీలు ముమ్మరం చేసి అక్రమంగా మొరం తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయమై బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణను వివరణ కోరగా ప్రభుత్వ భూముల నుంచి మొరం అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భీమిని, ఆగస్టు 3 : భీమిని మండలంలోని రాంపూర్‌లో ఇంటి నిర్మాణాల పేరుతో కొన్ని రోజులుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఆదివారం రోడ్డు పక్కన ఉన్న చెరువు కాలువ నుంచి మట్టిని తరలించారు. చెరువులపై పీడబ్ల్యూడీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో పట్ట పగలే యథేచ్ఛగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ బికర్ణ దాస్‌ను ఫోన్లో సంప్రదించగా రాంపూర్‌లో మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వలేదని, అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.