మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 20 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ముసుగులో గంజాయి దందా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా ఏరియాలోగల ఎస్బీఐ కాంప్లెక్స్ సెల్లార్లో సోమ ప్రవీణ్‌కుమార్‌కు చెందిన వై ఇన్ఫో సొల్యూషన్స్ (సీసీ కెమెరాల షాప్) సంబంధించిన గోదాంలో గంజాయి నిలువ ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించారు.
అక్కడ తనిఖీ చేయగా కాటన్ బాక్స్‌లలో ప్యాక్ చేసి ఉన్న గంజాయిని గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడిన వారిలో మంచిర్యాలకు చెందిన ఇరుగురాళ్ల సతీశ్ కుమార్, మహ్మద్ సమీర్, భీమ అనుదీప్, మహమ్మద్ అబ్దుల్ ఉబేద్, అర్జున్ బాబురావు, మహ్మద్ అజీజ్, జాడి రాఘవేంద్ర స్వామి, గూడూరు రాము, ఎస్కే అథాహుర్, ఎస్కే సమీర్, మరో మైనర్ ఉన్నారని, మరో 11 మంది నిందుతులైన సోమ ప్రవీణ్, తగరపు రాజు, తగరపు శృతి, తగరపు వినయ్, రామాలయం రాకేశ్, శ్రీధర్, మున్నీ, వికలాంగుడు (చింటూ), అల్మేకర్ శ్యామ్, క్వార్టర్ సాయి, సోహెల్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామమని సీపీ తెలిపారు.
పట్టుబడిన గంజాయి 23.5 కిలోలు అని, దీని విలువ రూ.11.75 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మంచిర్యాల టాస్‌ఫోర్స్ పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ, రాఘవేంద్ర, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, టాస్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి మంచిర్యాల సీఐ ప్రమోద్, ఇన్స్పెక్టర్, టాస్‌ఫోర్స్ సీఐలు రాజ్‌కుమార్, రమేశ్, టాస్ ఫోర్స్ ఎస్ఐలు లచ్చన్న, ఉపేందర్, కిరణ్ కుమార్ ఉన్నారు.
రాజీవ్‌నగర్‌కు చెందిన ఇరుగురాళ్ల సతీశ్‌కుమార్ కొనేళ్లుగా డ్రైవరుగా పని చేస్తున్నాడు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. మంచిర్యాలలో సీసీ కెమెరాల బిజినెస్ చేసే తన ఫ్రెండ్ సోమ ప్రవీణ్‌కు గంజాయి అక్రమ రవాణా గురించి చెప్పాడు. ఇందుకు ప్రవీణ్ స్పందిస్తూ సీలేరు వద్ద తకువ ధరకు ఎండు గంజాయి దొరుకుతుందని, తను కూడా ఇది వరకు ఇక్కడికి తెచ్చి అమ్మినట్లు చెప్పాడు.
అకడ గంజాయి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి మంచిర్యాలకు తీసుకువచ్చి తన సీసీ కెమెరాల షాప్ గోదాంలో పెట్టాలని, అందరూ గ్రూప్‌గా ఏర్పడి ఎకువ ధరకు గంజాయి అమ్మాలని పథకం రచించారు. 2024 డిసెంబర్ చివరివారంలో ప్రవీణ్, సతీశ్ వీరికి తెలిసిన గంజాయి తాగే స్నేహితుల (ప్రస్తుతం కేసులు నమోదైన వారు)తో సమావేశమయ్యారు. ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరుకు వెళ్లి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముఠాను గుట్టురట్టు చేశారు.