మంచిర్యాల, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్‌లో అడుగు పెడుతున్నారా.. అయితే మీరు పన్ను కట్టాలిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే. మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలోని కోటపల్లి మండలం పారుపల్లి వద్ద, చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామం సమీపంలోని జాతీయ రహదారి-63పై అటవీ అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ఈ మార్గం గుండా ప్రయాణించే వారి వద్ద హరిత రుసుం వసూలు చేయనున్నారు. కాగా, పారుపల్లి నుంచి కిష్టంపేట గ్రామం వరకు ఎలాంటి అడవి లేకపోగా, ఈ ప్రాంతంలో హరిత రుసం పేరిట డబ్బులు వసూలు చేయడమేమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ‘హరిత రుసం’ వసూలుకు తెరలేపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నూర్ చుట్టే ఈ చెక్పోస్ట్లుండగా, దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిపోయేవారు అటవీ అధికారులకు పన్ను కట్టాల్సిన పరిస్థితి రానున్నది. అటు మహారాష్ట్ర నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి వాహనానికీ అటవీ అధికారులు ‘హరిత రుసం’ వసూల్ చేయనున్నారు. మూడు చక్రాల వాహనానికి రూ.30, తేలిక పాటి వాహనాలకు రూ.50, భారీ వాహనాలకు రూ.200 చొప్పున వసూలు చేయనుండగా, ఇదేం తలనొప్పి అంటూ అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తుది దశకు చేరుకున్న చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు
కోటపల్లి మండలం పారుపల్లి వద్ద, చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై హరిత రుసుం వసూల్ కోసం చేపడుతున్న చెక్‌పోస్టుల ఏర్పాటు తుది దశకు చేరుకున్నది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర చీఫ్ వైల్ట్ లైఫ్ వార్డెన్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూ సింగ్ మేరు, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, మంచిర్యాల జిల్లా డీఎఫ్‌వో శిశ్ఆశిశ్ సింగ్ పరిశీలించి పలు సూచనలు చేశారు. చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు సిబ్బంది ఉండనుండగా, అక్రమ రవాణాకు తెరపడనున్నది. అయితే ఈ రుణం వసూల్ చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హరిత రుసుం ద్వారా వచ్చే డబ్బులను అటవీ జంతువుల సంరక్షణ, మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలకు వెచ్చిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. స్థానికుల నుంచి ఎలాంటి రుసుం వసూల్ చేయమని పేర్కొంటున్నారు.
భారం వేయడం సరికాదు
పారుపల్లి గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై చెక్ పోస్టు ఏర్పాటు చేసి హరిత రుసం వసూలు చేస్తరట. నిత్యం వేలాది మంది ఈ రూట్లో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజలపై పన్ను భారం వేయడం సరికాదు. అడవుల్లో సఫారీలు పెట్టి పర్యాటకుల నుంచి ఆదాయం సమకూర్చుకోవాలే కానీ.. ఇలా రోడ్డు పైన చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేయడం బాగా లేదు.
– బాపు, పారుపల్లి (కోటపల్లి)