మందమర్రి, డిసెంబర్ 4: విద్యార్థులకు అన్ని వసతులను సక్రమంగా కల్పిస్తే వసతి గృహ సందర్శనకు వచ్చిన తమను ఎందుకు అడ్డుకుంటున్నారని, గేట్లకు తాళాలు ఎందుకు వేశారు అని ? అధికారులను బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు చెన్నమల్ల చైతన్య, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా నాయకుడు భట్టు రాజ్‌కుమార్ ప్రశ్నించారు. ‘గురుకుల బాట’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మందమర్రిలోని రెండవ జోన్ కాలనీలోని ఎస్సీ బాలుర వసతి గృహ సందర్శనకు నాయకులతో కలిసి వెళ్లారు. వసతి గృహం గేటుకు వార్డెన్ తాళం వేసి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. కిటికీలో నుంచి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాంతియుతంగా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు సమస్యలను తెలుకునేందుకు వస్తే గేటుకు తాళం వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఆశయంతో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఏ నాడూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగలేదన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, 50 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతి, విద్య అందే వరకు పోరాడుతామన్నారు. బీఆర్ఎస్, సీనియర్ నాయకుడు కొంగల తిరుపతి రెడ్డి, యూత్, సోషల్ మీడి యా నాయకులు తోట సురేందర్, ముస్తఫా, దా సరి నవీన్, బెల్లం అశోక్, సీపెల్లి సాగర్, అఖిలేశ్ పాండే, అందె శ్రీకాంత్, రామ్ శేఖర్, గుజిగంటి శేఖర్, తోట సన్ని, ఎండీ ఇమ్రోజ్, సంపత్, తిరుపతి, సుధాకర్, తొగరి లింగమూర్తి, సంగర్తి సంతోష్, శేఖర్‌యాదవ్ పాల్గొన్నారు.