ఎదులాపురం, ఫిబ్రవరి 26 : బీజేపీ ప్రభుత్వం వద్దు.. రైతు రాజ్యమే ముద్దు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షతులై వార్డు నంబర్ 4లోని అనుకుంట బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది యువకులు, గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు పార్టీ జాయినింగ్ ర్యాలీని అనుకుంటలోని వీధుల గుండా డీజే సౌండ్ మధ్య నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. మన మతంతో పాటు ఇతర మతాలు కూడా గౌరవించబడేలా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నదన్నారు. ప్రజా సంక్షేమాన్ని బడా బాబులకు కేంద్రం అప్పగిస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంపద సృష్టించుకొని పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ వారికి అండగా ఉంటున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం కనీసం ప్రజలకు అందించాల్సిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల రేట్లు అమాంతం పెంచేసి తీవ్రమైన భారం మోపుతున్నదన్నారు. ఎన్నికలు రాగానే మతతత్వ రాజకీయం చేస్తూ ఓట్లు దండుకునే పనిలో బీజేపీ ఉంటుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జాహిర్ రంజానీ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, జోగు మహేందర్, సాజిదొద్దీన్, మహిళా అధ్యక్షురాలు స్వరూపారాణి, సభ్యులు పర్వీన్, బీసీ సంఘం పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖాన ప్రారంభం
జిల్లా కేంద్రంలోని అనుకుంటలో రూ.13.20 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే జోగు రామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీఎంహెచ్‌వో నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు. బస్తీ దవాఖానలో కల్పించిన వసతులను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం తోడ్పాటు అందిస్తున్నదని చెప్పారు. స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
బీసీల కోసం రూ.6,200 కోట్ల బడ్జెట్
బీసీల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం రూ.6,200 కోట్ల బడ్జెట్ కేటాయించిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ సంఘ భవనంలో బీసీ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా మహాత్మాజ్యోతి బాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన బీసీ సంఘం సభ్యులు బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా-పవన్‌రావు సమక్షంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా మేకల అశోక్, కన్వీనర్‌గా మంచికట్ల ఆశమ్మ, అడ్‌హక్ కమిటీ మహిళా విభాగం కన్వీనర్లుగా బియ్యాల అనుసూయ, ఉమామహేశ్వరి, కో కన్వీనర్‌గా కన్నాల లక్ష్మిని నియమించారు. ఉద్యోగ సంఘం కన్వీనర్‌గా జక్కుల శ్రీనివాస్, కో కన్వీనర్‌గా నర్ర నవీన్ యాదవ్, యువజన విభాగం కన్వీనర్‌గా తోకల నరేశ్, కో కన్వీనర్లుగా లంక కార్తీక్, ప్రపుల్ యాదవ్, టీ రమణ తదితరులను ఎన్నుకున్నారు.
ప్రతిపక్షాలకు అభివృద్ధి కనబడడం లేదా?
పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధి ప్రతిపక్ష నాయకులకు కనబడడం లేదా? అని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. 32వ వార్డు పరిధిలోని సోనార్గల్లీలో రూ.30లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేవలం సుందరీకరణ కోసం రూ.25 కోట్ల నిధులు వెచ్చిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను సైతం నెరవేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీజేపీ, కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఆదిలాబాద్ ఎంపీ నిధులతో ఏ వార్డుల్లో ఎంత ఖర్చు చేశారో తెలపాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, వార్డు కౌన్సిలర్ మోబిన్, మహిళా అధ్యక్షురాలు స్వరూప, సీనియర్ నాయకులు సాజిదొద్దీన్, కో ఆప్షన్ సభ్యులు ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.