అశ్వారావుపేట/ అశ్వారావుపేట టౌన్, నవంబర్ 17: నిద్రిస్తున్న సమయంలో అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. జేసీబీలను అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి ఇళ్లను నేలమట్టం చేసింది. ప్రత్యామ్నాయం చూపకుండానే గుడిసెలను తొలగించటంతో పలు కుటుంబాలు వీధినపడ్డాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. అశ్వారావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్, ప్రభుత్వ గోదాము వద్ద సుమారు మూడేళ్లుగా కొంతమంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో పోరాడుతున్నారు.
అయితే కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ అవసరాల కోసం గుడిసెలను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఇంతలోనే సోమవారం తెల్లవారుజామున ఉదయం 4గంటల సమయంలో ఒక్కసారిగా 300మంది సిబ్బందితో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గుడిసెలపై దాడి చేసి నేలకూల్చారు. ఇళ్లల్లో ఉన్న సామాగ్రిని బయటకు విసిరి పారేశారు. జేసీబీని అడ్డుకోబోయిన పేదలను పక్కకు నెట్టేసి మరీ ఇళ్లను కూల్చేశారు. ఇంట్లో సామాగ్రి తీసుకెళ్తామని ప్రాథేయపడ్డా కనికరించలేదు. కొద్దిగా సమయం ఇవ్వాలని వేడుకున్నా వినలేదు. చంటిపిల్లలు, వృద్ధులతో చలికి వణుకుతూ పేద కుటుంబాలు రోడ్డుపైకి వచ్చారు. ఇందులో గుడిసెల్లో ఉన్న సామాన్లను భద్రపరుచుకున్నారు. గుడిసెల తొలిగింపునకు అడ్డురాకుండా ఆదివారం అర్ధరాత్రి సీపీఐ నాయకులను అరెస్ట్ చేసి దమ్మపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఓట్లు వేసుకున్న రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యామ్నాయం చూపకుండా అన్యాయంగా గుడిసెలను తొలిగిస్తున్నారంటూ బాధితులు శాపనార్థాలు పెట్టారు. పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ నేతృత్వంలో సీఐ నాగరాజు, తహసీల్దార్ రామకృష్ణలు కూల్చివేతలను పర్యవేక్షించారు. నిరుపేదల గుడిసెలను తొలిగించిన అధికారులు వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడిసెలు తొలిగించిన ప్రదేశాన్ని ఆయన సందర్శించి తెల్లవారుజామున అధికార యంత్రాంగం మూకమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించటం సరికాదని హితవు పలికారు. బాధితులకు నష్టపరిహారంతోపాటు ప్రత్యామ్నాయం చూపే వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఆయన వెంట ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముత్యాల విశ్వనాధం, నరాటి ప్రసాద్, సయ్యద్ సలీమ్, స్థానిక నాయకులు ఉన్నారు.