కుభీర్, జూన్ 6 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ఐకేపీ, మండల పరిషత్, నూతన తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన మూడు జొన్న టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శనివారం ఉదయం నుంచే వందలాది మంది రైతులు బారులుదీరారు. కొనుగోలు కేంద్రాల్లో జొ న్నలు విక్రయించేందుకు గాను టోకెన్లను పొందేందుకు శుక్రవారం రాత్రి నుంచే నిద్రహారాలు మాని జాగారం చేశారు. శనివారం ఉదయం 9 గంటల తర్వాత చేరుకొన్న ఐకేపీ సిబ్బంది టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టారు. అధిక సంఖ్యలో వచ్చిన రైతులను అదుపు చేయడానికి క్యూలో వెనుక నుంచి ముందుకు, ముందు నుంచి వెనకకు తోసుకోవడంతో పలువురు రైతులు బ్యాలెన్స్ ఆపుకోలేక కిందపడిపోయారు.
జొన్నల కొనుగోలును ప్రభుత్వం ఐకేపీ (మండల మహిళా సమాఖ్య)కు అప్పగించగా వారికి ముందెన్నడూ ఐకేపీ సిబ్బందికి ప్రొక్యూర్మెంట్ అనుభవం లేక పోగా ఒకే రోజూ అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చి తోపులాట జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. క్యూలో అప్పుడప్పుడే వచ్చిన రైతులు చొరబడడంతో వె నకున్న రైతులు గట్టిగా అరుపులు, కేకలు వేయడంతో తో పులాటకు దారితీసింది. దీంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పలువురు మహిళా రైతులు క్యూలో కిందపడిపోయారు.
ఈ తరుణంలో మూడు కౌంటర్ల వద్ద జరుగుతున్న పరిణామాలను అదుపు చేసేందుకు పోలీసు సి బ్బంది ఇబ్బంది పడ్డారు. వెంటనే తేరుకున్న ఐకేపీ సిబ్బం ది ముందుగా క్యూలైన్లలో నిల్చున్న రైతుల వద్ద నుండి పంట నమోదు పత్రాలను కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా రిజిస్టర్లలో నమోదు చేసుకుంటూ పేరుతో పిలిచి టోకెన్లను జారీ చేశారు. దీంతో సమస్య సద్దుమణిగి అదుపులోకి వచ్చింది. రాత్రి 8 గంటల వరకు పూర్తి స్థాయిలో టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగవచ్చని ఏపీఎం తెలిపారు.

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమే..
– బీఆర్ఎస్ కుభీర్ మండలాధ్యక్షుడు అనిల్
జొన్నలు ఇండ్లకు వచ్చి రెండు నెలలు గడిచిన తర్వాత జూన్‌లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటే ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమే నని బీఆర్ఎస్ కుభీర్ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ పేర్కొ న్నారు. శనివారం ఆయన మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలిం చారు. తరలి వచ్చిన పలువురు రైతులతో మాట్లాడి వారిని సము దాయించారు. ఎకరాకు 26 క్వింటాళ్ల కొర్రీలతో ఈపాటికే సగం మంది రైతులు మొక్కజొన్నలను ప్రైవేటులో రూ.1700లకు క్వింటాలు చొప్పున అమ్ముకొని నష్ట పోయారని తెలిపారు. పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టారీతిన టోకెన్ల జారీ చేపట్టడంతో ఒకేసారి వందలాది మంది రైతులు తరలి రావడంతో అయోమయ పరిస్థితు లు నెలకొన్నాయని అన్నారు. ఐదు కొనుగోలు కేంద్రాలు తెరిచి త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
హమాలీల కొరత
ముథోల్, జూన్ 6 : నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని విట్టోలి గోదాములో హమాలీల కొరతతో పంట తీసుకొచ్చిన ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడుతుండ డంతో చేలను చదును చేసుకుందామనుకుంటే రెండు రోజులుగా ట్రాక్టర్లు క్యూలో ఉండిపోతున్నాయని వాపోతున్నారు. దీంతోపాటు కిరాయి అదనంగా ఇవ్వాల్సిన వస్తున్నది ఆవేదన చెందుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి త్వరితగతిన ట్రాక్టర్లను ఖాళీ చేయించాలని రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ మళ్ల అధికారంలోకి రాదు..
శుక్రవారం రాత్రి పది గంటలకు వచ్చా. శనివారం సాయం త్రం ఐదు గంటల కు టోకెన్ ఇచ్చారు. ఎకరాకు 10 క్విం టాళ్లే తీసుకుంటే మిగతావి ప్రైవేటు లో వ్యాపారులకు అమ్ముకోవాల్సిందే. పదేళ్ల పాలనలో రైతులకు ఏ ఇబ్బంది రానీ యకుండా, వారి ఆర్థిక బలోపేతానికి బాట లు వేసిన కేసీఆర్ సార్‌కు హ్యాట్సాఫ్ చెప్పా లి. మక్కలు, శనగలు, సోయా, జొన్నలు, కందులు కేంద్రం సపోర్టు చేయక పోయి నా.. మద్దతు ధరకు కొనుగోళ్లు చేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. నేను మహారాష్ట్రలో బంధువుల వద్దకు తరచూ వెళ్తా. అక్కడి వారు తిడతారు. రైతుల పాలిట దేవుడిగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్‌ను తెచ్చుకున్న మీరు ఏం మనుషులని ఎన్నో మార్లు అన్నరు. ఇది విన్న నాకు సిగ్గు చేటనిపిస్తుంది. రైతుల పథకాలన్నీ తుంగలో తొక్కి, రైతుల కళ్లల్లో నీళ్లు తెప్పించే ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కల్ల.
– జాదవ్ విజయ్, రైతు, ఫకీర్ నాయక్ తండా, కుభీర్ మండలం.
ఇంకా.. 20 రోజులు మార్కెట్లోనే ఉండాలి..
కనీసం ఐదారు సెంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ టోకెన్లతో పాటు కొనుగోళ్లు జరిపితే నెల రోజుల్లో పూర్తవ్వడం జరుగుతది. కానీ.. ఒకే సెంటర్లో 10 వేల పైచిలుకు ఎకరాల్లో 4 వేల మంది జొన్న రైతులు 1.20 లక్షల క్వింటాళ్ల జొన్నలను ఎప్పుడు తూకం వేసి ఎప్పుడు తరలిస్తారో అర్థం కావడం లేదు. మరో పక్క రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు. ఆలస్యంగా ప్రా రంభించి రైతులను కష్టాల్లోకి నెట్టారు. నిన్న వచ్చిన నేను మధ్యాహ్నం టోకెన్ అందింది. 28వ తేదీన తూకం జరుగుతుందన్నారు. వేచి చూడాలి మరి.
– హేమ్లే రమేశ్, రైతు, పల్సి, కుభీర్
మబ్బుల్నే వచ్చా.. టోకెన్ దొరకలేదు..
నేను మూడెకరాల్లో జొన్న వేశా. కోత కోసి నూర్పిడి చేసి నెల రోజులైంది. జొన్నలు ప్రభుత్వం కొంటుందో లేదో తెలియక పోగా నిన్న మొన్నటి వరకు మక్క కొనుగోళ్లు జరిగాయి. అల్కుళ్లప్పుడు ఏం కొంటరనుకున్నా. కానీ.. ఐకేపీ ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లు ప్రారంభం కావడంతో పాణమొచ్చింది. రాత్రి టోకెన్లు ఇస్తున్నారని తెలిసి శనివారం ఉదయం వెళ్లి క్యూలో నిల్చున్న. సాయంత్రం 5 గంటల వరకు ఉన్నా ఆకలి వేస్తున్నదని చెప్పి ఊర్లోకి పోయా. వచ్చే వరకు నన్ను లైన్లో నిల్చోనివ్వడం లేదు. చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వెళ్లి పోయా.
– రాథోడ్ సచిన్, రైతు, పార్డి(కె), కుభీర్ మండలం.
పది గంటలు లైన్లో నిల్చున్న..
టోకెన్ల కోసం, తూకం వేసేటప్పుడు గంటలు గంటలు నిల్చోబెట్టడం దారుణం. మా అమ్మ పేరు మీద పట్టా ఉంది. టోకెన్ల కోస నేను వచ్చా. ఉదయం నుంచి ఏమి తినలేదు. తినేందుకు పోతే టోకెన్ దొరకదేమోనని భయపడ్డా. పది గంటలు లైన్లో నిల్చున్న. ఇప్పుడే సాయంత్రం 6.15కి టోకెన్ ఇచ్చారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతులను అష్టకష్టాల పాలు చేస్తున్న ఇలాంటి ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు. ఎకరంలో 16 క్వింటాళ్ల జొన్నలు దిగుబడి వచ్చాయి. పది క్వింటాళ్లు మాత్రమే కొంటారు. మిగతా ఆరు క్వింటాళ్లు తక్కువ ధరతో అమ్ముకొని నష్ట పోవాల్సిందే.
– శేరి శ్రీకాంత్, రైతు, కుభీర్