ఆదిలాబాద్, అక్టోబర్ 25 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొన్నది. పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందనే కారణం చూపుతూ కొనుగోలుకు సీసీఐ నిరాకరిచింది. ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారని ఆశించిన రైతులకు సైతం నిరాశే మిగిలింది. 8 శాతం తేమతో క్వింటాల్‌కు రూ.7200 మించి కొనుగోలు చేసే ప్రసక్తి లేదని వ్యాపారులు పట్టుబట్టారు. వ్యాపారులతో ధర విషయంలో కలెక్టర్ రాజర్షి షా, బోథ్ ఎమ్మెల్యేలు చర్చించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పంట కొనుగోళ్లు రాత్రి 8 గంటలైనా ప్రారంభం కాలేదు. పంట కొనుగోళ్లపై ఆశలు పెట్టుకున్న రైతులు గురువారం రాత్రి నుంచి వాహనాల్లో పంటను ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం వరకు దాదాపు 300 వరకు వాహనాలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. వందల సంఖ్యలో రైతులు తమ పంటను విక్రయించడానికి మార్కెట్‌కు తరలివచ్చారు.
చేతులెత్తేసిన సీసీఐ
పంట కొనుగోళ్లలో భాగంగా ఉదయం మార్కెటింగ్ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.7521గా ప్రకటించారు. వేలంలో పాల్గొన్న ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6700 నుంచి ప్రారంభించి రూ. 7150 వద్ద ముగించారు. సీసీఐ ధర ఎక్కువగా ఉండడంతో పంట కొనుగోళ్లను సీసీఐ చేపడుతుందని ప్రకటించిన అధికారులు ఒకటవ నంబర్ కాంటా వద్ద కొబ్బరికాయ కొట్టారు. మార్కెటింగ్ సిబ్బంది తేమ శాతాన్ని పరీక్షించగా 19, 22, 25 శాతం వరకు వచ్చింది. నిబంధనల ప్రకారం పత్తిలో 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటేనే పంటను కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చేతులెత్తేశారు. కలెక్టర్ రాజర్షిషా, బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ధర విషయంలో ప్రైవేట్ వ్యాపారులతో చర్చించినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ మార్కెటింగ్ కార్యాలయంలో వ్యాపారులతో మరోసారి చర్చలు జరిపి క్వింటాల్‌కు రూ. 7200తో కొనుగోలు చేసేలా ఒప్పించారు. తేమ శాతంలో 8 నుంచి 12 ఉంటేనే కొంటామని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఇందుకు నిరాకరించారు. దీంతో పంట కొనుగోళ్లు జరగలేదు. కలెక్టర్ వ్యాపారులతో నాలుగు గంటలకు పైగా రాత్రి 8 గంటల వరకు చర్చలు నిర్వహించారు.
రైతుల ఆందోళన
తేమ పేరిట సీసీఐ పంట కొనుగోళ్లకు నిరాకరించడం, ప్రైవేట్ వ్యాపారులు ధర విషయంలో పట్టు వీడకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మార్కెట్‌యార్డు ముందున్న రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని పంజాబ్‌చౌక్‌లో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంట కొనుగోళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు 10 గంటల పాటు తిండి తిప్పలు లేక, ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది.