కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ‘కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్‌గా మారుస్తూ తీసుకొచ్చిన 49 జీవో వద్దే వద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఆ జీవోను పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తాం’ అంటూ ఆదివాసీ హక్కు ల పోరాట సమితి (తుడుం దెబ్బ) నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. ప్లకార్డులు చేతబట్టుకొని స్థానిక ఆదివాసీ భవన్ నుంచి కుమ్రం భీం చౌరస్తా మీదుగా కలెక్టరేట్‌కు చేరుకొని సు మారు 3 గంట ల పాటు ధర్నా చేపట్టారు.
తుడెం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజ య్ మాట్లాడుతూ 339 ఆదివాసీ గ్రామాలపై ప్రభావం చూపే ఈ జీవో రావడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల వైఫల్యమేనని మండిపడ్డారు. ఆదివాసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి బతుకులను ఆగం చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే 49 జీవోను తాత్కాలికంగా నిలిపివేయడం కాకుండా పూర్తిగా రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే జీవోను తాత్కాలికంగా నిలిపివేశారన్నారు.
ఓపెన్ కాస్టుల ఏర్పాటుతో వేలాది ఎకరాల్లో అడవులు నాశమవుతున్నాయని, దశాబ్ధాల కాలంగా వందలాది ఆదివాసీ గ్రామాలు ఉనికిలో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను నాశనం చేసే ఓపెన్ కాస్టులకు దాసోహం పలుకుతున్న ప్రభుత్వాలు.. ఆదివాసీలను మాత్రం అడువుల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. జీవో 49ను రద్దు చేయకపోతే జిల్లాలో మరో కుమ్రం భీం, రాంజీగోండ్ ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పార్టీలు చేస్తున్న రాజకీయాలను ఆదివాసీలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
కొంత మంది ఆదివాసీ ఎమ్మెల్యేలు, నాయకులు 49 జీవో రద్దు కాకుంటే తమ పదవులకు రాజీనామాలు చేస్తామంటున్నారని, ఆదివాసీలపై చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోను పూర్తిగా రద్దు చేయించేవారని అన్నారు. ఆదివాసీ ఎమ్మెల్యేలే ఆదివాసీలను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద తమ ఉనికిని కాపాడుకుంనేందుకు ఆదివాసీ జాతినే మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివాసీలపై నిజమైన ప్రేమ ఉంటే 49 జీవోను ఎందుకు రద్దుచేయలేదని ప్రశ్నించారు.
ఇకనైనా సర్కారు దిగిరాకుంటే స్థా నిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని, కాంగ్రెస్ నాయకులను ఆదివాసీ గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. ఆగస్టు నుంచి ఆదివాసీ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.
సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా 49 జీవో వచ్చిందన్నారు. 49 జీవో రద్దుకోసం వచ్చే సోమవారం (4వ తేదీ) కాగజ్‌నగర్‌లోని ఫారెస్ట్ డివిజల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడుతామని, జిల్లాలోని ఆదివాసీలు, వివిధ సంఘాల నాయకులు తరలివచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ఆందోళనలో జిల్లాలోని వివిధ మండలాల ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా
నస్పూర్, జూలై 28 : 49 జీవోను పూర్తిగా రద్దు చేయాలని, దసలి పట్టు గూళ్ల రైతుల మీద అటవీ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ 50 ఏళ్లుగా దసలి పట్టుగూళ్లను పెంచుతూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకువచ్చి ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఆదివాసీల మీద అటవీ అధికారులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జేక శేఖర్, నాయకులు మాంతయ్య, జయిలు, బాపు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.