జైనథ్, డిసెంబర్ 21 : భార్యాభర్తల మధ్య గొడవలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు తీశాయి. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడగా, పిల్లలు మృతిచెందారు. ఈ హృదయ విధారక సంఘటన బుధవారం జైనథ్ మండలం బాలాపూర్‌లో చేటుచేసుకుంది. ఎస్ఐ పెర్సిస్ బిట్ల తెలిపిన వివరాల ప్రకారం.. వాన్కడ్ గణేశ్-సుష్మ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఆదిత్య(4), ఆర్యా(2). తాగుడుకు బానిసైన గణేశ్ తరుచు భార్యతో గొడవపడేవాడు.
రెండ్రోజుల నుంచి వేధింపులు ఎక్కువవడంతో సుష్మ, పిల్లలతో కలిసి గ్రామం సమీపంలోని బావిలో దూకింది. అరుపులు వినిపించడంతో స్థానికులతో పాటు భర్త తాడుసాయంతో సుష్మను బయటికి తీశారు. అప్పటికే చిన్నారులిద్దరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా చేసి, చిన్నారుల మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.